రాజమౌళి అద్భుత సృష్టి 'బాహుబలి ది బిగినింగ్'కి ఇండియాలోనే కాకుండా, యావత్ ప్రపంచం నుండే మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి ఎదిగింది అంటే అది కేవలం 'బాహుబలి' సినిమా కారణంగానే జరిగిందని చెప్పొచ్చు. 'బాహుబలి' ఫ్రాంచైజీలో ఇప్పటికే చాలా రకాల నవలలు, కంప్యూటర్ గేమ్స్, యానిమేషన్స్ వచ్చేశాయి. తాజాగా రాబోతున్న అంశం చాలా ఇంట్రెస్టింగ్ ఐటెం అట. అదే 'బాహుబలి' మొబైల్ గేమ్. ప్రముఖ మెబైల్ గేమ్స్ రూపకర్త మార్క్స్ స్కాగిల్స్ ఈ గేమ్‌ని రూపొందించబోతున్నారట. ఇదేదో సినిమా ప్రమోషన్ కోసమే అన్నట్లుగా కాకుండా, ప్రొఫిషనల్ గేమ్‌లా రూపొందించబోతున్నారట రాజమౌళి. అయితే ఇది ఎప్పుడొస్తుందో తెలీదు కానీ, చర్చలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. అయినా అక్కడ ఉన్నది రాజమౌళి కదా. అతి త్వరలోనే రావచ్చు. మార్క్స్‌తో రాజమౌళి ఇప్పటికే సంప్రదింపులు జరిపి తగిన సూచనలిచ్చినట్లు సమాచారం. 'బాహుబలి' సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన చిత్రం కాబట్టి, ఈ గేమ్ కూడా యూనివర్సల్ గుర్తింపు పొందాలనే ఉద్దేశ్యంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ప్రపంచ స్థాయిలో ఈ సినిమాకి వచ్చిన ఇమేజ్‌ని బేస్ చేసుకుని ఈ గేమ్‌ని రూపొందిస్తున్నారట. అలాగే 'బాహుబలి ది కన్‌క్లూజన్' సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఏప్రిల్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజమౌళి బృందం సన్నాహాలు చేస్తోంది.