2018లో బిగ్గెస్ట్ హిట్ ఏ సినిమా అని అడిగితే తడుముకోకుండా 'రంగస్థలం' సినిమా గురించి చెప్పేస్తాం. నిజానికి అది కల్పిత కథ. ఓ సినిమా అంతే. కానీ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకున్ని రంగస్థలం అనే ఊళ్లోకి తీస్కెళ్లిపోతుంది.
చిట్టిబాబు, కుమార్ బాబు, రామలక్ష్మి, రంగమ్మత్త ఇలా ఈ పాత్రల మధ్య మనం ఉంటాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటిక్ అనే విషయాన్ని మర్చిపోతాం. అదే దర్శకుడి గొప్పతనం. కొన్ని కమర్షియల్ సినిమాలు విజయం సాధించడం సంచలన విజయాలు అందుకోవడం పెద్ద విషయమేమీ కాదు. సినిమా తీసి అందులోని పాత్రల్లోకి, ఆ పరిస్థితుల్లోకీ ప్రేక్షకుల్ని తీసుకెళ్లిపోవడం అనేది ఓ కళ. చాలా తక్కువ మందికే ఈ విద్య సొంతమవుతుంది.
ఇప్పుడు ప్రతీ ఒక్కరూ 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదొక సినిమానా? మొదట్లో కొంతమంది పెదవి విరిచారు. సినిమా రిలీజ్‌కి ముందు పరిస్థితి అది. హీరో దగ్గుబాటి రానా ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు ముందుకొచ్చారు. అందుకు ఆయన్ని అభినందించి తీరాలి. కంచరపాలెం అనే ఊళ్లో కొంతమంది సాధారణ వ్యక్తులున్నారు. ఆ సాధారణ వ్యక్తుల సామాన్యమైన జీవితం మనల్ని కట్టి పడేస్తుంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు, అమెరికాలోనూ 'కంచరపాలెం' సినిమాకి వసూళ్ల పంట పండుతోంది. గట్టిగా 25 లక్షలు కూడా ఖర్చు కాలేదు ఆ సినిమాకి. ఇదొక అద్భుతం. ఈ ఏడాది కొన్ని సినిమాలు నిరాశపరిచినా, ఓవరాల్‌గా తెలుగు సినీ పరిశ్రమ కళకళలాడుతూనే ఉంది. 'రంగస్థలం' నుండి 'కంచరపాలెం' దాకా కొత్త తరహా సినిమాలు అంచనాలకు మించి విజయాల్ని అందుకుంటుండడం అభినందించదగ్గ విషయం.