ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చాడు. హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక్క సక్సెస్ కొడితేనే కొందరిలో అహంకారం పెరిగిపోతుంది. కానీ సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొట్టినా నానిలో ఎంత మాత్రం అహంకారం పెరగలేదు.
ఎప్పటికీ నేను మిడిల్ క్లాస్ అబ్బాయినే అంటాడు. అదే నానికి ఇంత సక్సెస్ తెచ్చిపెట్టింది. ఇంతటి అభిమానాన్ని ఇచ్చింది. నాని ఎప్పటికీ పక్కింటబ్బాయిలానే అనిపిస్తాడు. అతను స్క్రీన్‌పై కనిపిస్తే నటించినట్లుండదు. మనింట్లో అబ్బాయిని చూస్తున్నట్లుగానే, జీవిస్తున్నట్లుంది. ఆ నేచురాలిటీనే నానిని హీరోగా ఈ స్థాయిలో నిలబెట్టిందనడంలో అతిశయోక్తి కాదు. దర్శకత్వ విభాగం నుండి వచ్చినా, కానీ తాను ఒప్పుకున్న సినిమాల్లో ఏ సినిమాలోనూ వేలు పెట్టడు.
దర్శకుడు చెప్పిందే చేస్తాడు. అలాగే ప్రొడ్యూసర్స్‌కి ఫ్రెండ్లీ. రెమ్యునరేషన్ విషయంలోనూ చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు నానితో ప్రొడ్యూసర్స్. మినిమమ్ బడ్జెట్‌తో ఫుల్ గ్యారంటీ అనే నమ్మకం నాని సినిమాలతో నిర్మాతలకుంటుంది. ఈ ఏడాది మూడు సినిమాలతో వచ్చాడు. మూడు సినిమాలతోనూ హిట్ కొట్టి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. ఇండస్ట్రీలో ఏ బ్యాడ్ రిమార్క్ లేనోడు. స్టార్ హీరోలకు సమానంగా స్టార్‌డమ్ సంపాదించుకున్నా, ఎక్కడా గర్వం ప్రదర్శించడు. అందుకే ఇండస్ట్రీలో నానిని ఇష్టపడని వారుండరు.
ఇంతటి అభిమానం తనకి పంచిన అభిమానులకు మీరిచ్చే గిఫ్ట్ ఏంటని అడిగితే, ఏడాదికి మూడు సినిమాలూ ఖచ్చితంగా చేస్తాను. వీలైతే అంతకన్నా ఎక్కువే చేస్తాను. అదే నేను అభిమానులకు ఇచ్చే గిఫ్ట్ అంటున్నాడు. ప్రస్తుతం 'కృష్ణార్జున' సినిమాలో నటిస్తున్నాడు. కాన్సెప్ట్ నచ్చి 'అ' సినిమాతో నిర్మాతగానూ కొత్త అవతారమెత్తాడు నాని. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 'అ' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.