ఇకపై ప్రజా క్షేత్రంలోనే ఉంటాననీ, ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసేస్తానని ఈ మధ్య జనంలోకి వెళ్ళిన పవన్‌కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. అభిమానుల కేరింతల నడుమ పవన్‌కళ్యాణ్, రాజకీయ ప్రసంగాలు కొనసాగుతున్నాయి. ఇదివరకటిలా ఆయనలో ఆవేశం కన్పించడంలేదు, ఆలోచన కన్పిస్తోందనే ప్రశంసలు ఓ పక్క, చప్పగా పవన్ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారనే విమర్శలు ఇంకో పక్క వినవస్తున్నాయి.
అయితే పవన్‌కళ్యాణ్ పూర్తిగా సినిమాలకి గుడ్ బై చెప్పేసినట్లేనా? అన్న ప్రశ్న చుట్టూ ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. 'ఇకపై సినిమాలకు సమయం కేటాయించలేను' అని పవన్ చెప్పినప్పటికీ, 2019 ఎన్నికలే లక్ష్యంగా పవన్‌కళ్యాణ్ ఓ పొలిటికల్ సినిమా చేయబోతున్నారని తాజా గాసిప్స్‌ని బట్టి తెలుస్తోంది. వాస్తవానికి 'అజ్ఞాతవాసి' సినిమా హిట్ అయి ఉంటే, పవన్ ఇంకో సినిమా ఇప్పట్లో చేసి ఉండేవారు కాదేమో. కానీ ఆ సినిమా నిరాశపర్చింది. దాంతో ఖచ్చితంగా ఇంకో సినిమా చేసి, పవన్ తన అభిమానుల్ని అలరించి తీరాలి.
ఆ దిశగానే పవన్ అడుగులేస్తున్నారట. అన్నీ కుదిరితే ఏప్రిల్ - మే నెలల్లో పవన్‌కళ్యాణ్ కొత్త సినిమా పట్టాలెక్కబోతోందట. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనే పవన్ ఈ సినిమా గురించి చర్చిస్తున్నారట. అయితే అది త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుందా? అనేదానిపై స్పష్టత లేదు. పవన్ పొలిటికల్ స్పీచ్‌లను సైతం త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో త్రివిక్రమ్ సహకారం లేకుండా పవన్ తదుపరి సినిమా చేయకపోవచ్చు. ఏదేమైనా ఇంకో సినిమా పవన్ చేయబోతున్నాడంటే అది పవన్ అభిమానులకి సూపర్ సెన్సేషనల్ న్యూస్‌గానే పరిగణించాల్సి ఉంటుంది.