మెగాస్టార్ చిరంజీవి చెట్టు నీడన పుట్టుకొచ్చిన చాలామంది స్టార్స్‌లో పవన్‌కళ్యాణ్‌ని కూడా ఒకరిగానే చూస్తారు చాలామంది. అన్నయ్యను మించి.. తమ్ముడు పవన్‌కళ్యాణ్ స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నా, 'ఆ అన్నయ్యకు తమ్ముడే' అన్న గుర్తింపు ఎప్పటికీ పవన్‌కళ్యాణ్‌కి అలాగే వుంటుంది.
2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి, సినిమాలకు దూరమయ్యారు. జస్ట్ రెండేళ్ళలోనే వాస్తవం తెలుసుకుని, జాగ్రత్తపడ్డారాయన. తిరిగి సినిమాల్లో నటించడానికి దాదాపు తొమ్మిదేళ్ళ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. 'ఇది కదా నా అడ్డా' అని చిరంజీవి సినీ రంగం గురించి ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. రేప్పొద్దున్న పవన్‌కళ్యాణ్ పరిస్థితి కూడా ఇంతే కావొచ్చు. 2019 ఎన్నికలకు ఇంకెంతో దూరం లేదు. ఈలోగా పార్టీని పటిష్టం చేసి, జనంలోకి ఆ పార్టీని తీసుకెళ్ళి, ప్రజా బలమెంతో తేల్చుకోవడం పవన్‌కళ్యాణ్‌కి కత్తిమీద సామే.
నాలుగేళ్ళ క్రితం పార్టీ పుట్టినా, ఇప్పటిదాకా ఆ పార్టీకి ఒక్కరంటే ఒక్క ప్రజా ప్రతినిథి కూడా లేరు. ఒక్క ఎన్నికల్నీ పవన్‌కళ్యాణ్ స్థాపించిన జనసేన ఫేస్ చేయలేదు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే, 2019 ఎన్నికల తర్వాత సినీ రంగమే తన 'అడ్డా' అని పవన్ కూడా గుర్తు చేసుకుంటారని ఆయనకు సినీ పరిశ్రమలో అత్యంత సన్నిహితులైనవారు అభిప్రాయపడుతున్నారట.
'అజ్ఞాతవాసి' ఎఫెక్ట్ నుంచి బయటపడానికి, రాజకీయాల్లో పవన్ ఇంకొంత ఎగ్రెసివ్‌గా కనిపిస్తున్నా, అది ఆయనకు నెగెటివ్ ఇమేజ్ తెస్తుంది తప్ప, అభిమానుల్లోనూ పాజిటివ్ ఎనర్జీని నింపలేకపోతోంది.