రాజకీయాలు వేరు, సినిమాలు వేరని ఎవరన్నారు? సమాజంలో రాజకీయం ఓ భాగం, సినిమా ఇంకో భాగం. సినిమా అనేది ఓ కళా రూపం. రాజకీయం ఎలాగైతే వ్యాపారమైపోయిందో, సినిమా రంగం కూడా ఓ వ్యాపారమే అనుకోవాలి. సినీ నటులకు సామాజిక బాధ్యత ఖచ్చితంగా వుంటుంది. ఎందుకంటే వారూ సమాజంలో బాగమే. కొందరు ఆ సామాజిక బాధ్యతను ఫీలవుతారు, కొందరు పట్టించుకోరు. అంతే తేడా.
విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌కి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చిపడింది. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంతో ప్రకాష్‌రాజ్ 'గొడవ' పెట్టుకున్నారు. 'జస్ట్ ఆస్కింగ్' పేరుతో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్నారాయన. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు (వీళ్ళంతా బీజేపీకి వంగి వంగి దండాలు పెడుతున్నవారేననుకోవాలేమో) ప్రకాష్‌రాజ్‌కి మొండిచెయ్యి చూపిస్తున్నారట.
'నేను మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టాక నన్ను బాలీవుడ్‌లో ఎవరూ తీసుకోవడంలేదు. అయినా నా పోరాటం ఆగదు. నేను కళాకారుడ్ని, నాకు సామాజిక బాధ్యత వుంది' అంటూ చెప్పారాయన. తెలుగు సినీ పరిశ్రమ నుంచి కూడా ప్రకాష్‌రాజ్‌కి ఈ సహాయ నిరాకరణ జరుగుతోందా.? తమిళ సినిమాల మాటేమిటి? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
'రాజకీయాల్లోకి వచ్చేశాను' అని ప్రకటించుకున్న ప్రకాష్‌రాజ్, ఇలా తనకు సినీ పరిశ్రమ నుంచి అవకాశాలు రాకపోతే పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెడతారేమో! అలాగయితే ప్రకాష్‌రాజ్ సినిమా కెరీర్ ముగిసినట్టేనా?