సినిమా రివ్యూలను ఆపగలమా?

మరిన్ని వార్తలు

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, సినిమా రిలీజయిన తర్వాత రెండు మూడు రోజులదాకా 'రివ్యూలు రాయకపోవడమే మంచిది' అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంతకు ముందు ఈ అభిప్రాయాన్ని హీరో విశాల్‌ తెరపైకి తీసుకురాగా, విశాల్‌ వ్యాఖ్యల్ని రజనీకాంత్‌ సమర్థించడం జరిగింది. ఎప్పటినుంచో సినీ రివ్యూలపై సినీ పరిశ్రమలో కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఒకప్పుడు సినిమా రివ్యూలు చాలా అరుదు. అయితే ఇంటర్నెట్‌ విప్లవంలో సినిమా రివ్యూలు వేగం పుంజుకున్నాయి. సినిమా విడుదలకు ముందు ప్రివ్యూ షో పడినా, దాన్ని చూసి రివ్యూలు రాసేయడం చూస్తున్నాం. వీటిని ఆపడం ఎవరితరమూ కాదు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా రివ్యూలు రాసేవారనే కాకుండా, సాధారణ ప్రేక్షకులు కూడా తమ అభిప్రాయాల మేరకు సినిమాలపై విశ్లేషణలు చేసేస్తున్నారు. ఒక్కోసారి వారి విశ్లేషణలు రివ్యూలను మించి ఉంటున్నాయనడం నిస్సందేహం. మొబైల్‌లోని వాట్సాప్‌ల ద్వారా కూడా ఈ విశ్లేషణలు ఒకరి నుంచి ఇంకొకరికి చాలా వేగంగా వెళ్ళిపోతున్నాయి. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి సోషల్‌ మీడియా వేదికల్లో కూడా అంతే. కాబట్టి రివ్యూలను ఆపమనడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్థం లేని వ్యవహారంగానే భావించాలేమో. చట్ట విరుద్ధమైన పైరసీని అరికట్టడంలోనే సినీ పరిశ్రమ అంతా ఒక్కతాటిపైకి వచ్చినా ఫలితం ఉండటం లేదు. అలాంటిది ప్రేక్షకాభిప్రాయంగా మారిపోయిన రివ్యూలను ఆపాలనే ఆలోచన కూడా సబబు కాదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS