స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని ప్రకటించిన ఆయన కుమారుడు నందమూరి నట సింహం బాలకృష్ణ, ఈ సినిమాపై ఇంకొంచెం క్లారిటీ ఇచ్చారు. ఎన్టీయార్ మీద సినిమా తీయడమంటే సినీ, రాజకీయ విశేషాలు అందులో ఉండాలి. జననం నుంచి మరణం దాకా చాలా విశేషాల్ని చూపించవలసి ఉంటుంది. సినీ రంగంలో ఎన్టీయార్ నెంబర్ వన్. రాజకీయాల్లో కూడా అంతే. అలాగే ఎన్టీయార్ మరణం ఇప్పటికీ ఓ సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. ఇంతకీ సినిమాలో బాలకృష్ణ ఏం చూపించబోతున్నారో ఎవరికీ తెలియడంలేదు. ఈ ప్రశ్ననే బాలకృష్ణ ముందుంచితే, ఎలా ప్రారంభించాలో తెలుసు, ఎలా ముగించాలో కూడా తెలుసునని చెప్పారు. బాలకృష్ణ మాటల్ని బట్టి చూసినట్లయితే ఎన్టీయార్ సినీ విశేషాలతోపాటుగా, చాలా తక్కువగానే రాజకీయ విశేషాలను చూపించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అలాగే అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టడం, ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు గెలుచుకోవడం వరకే ఎన్టీయార్ సినిమాలో చూపిస్తారని అనుకోవచ్చు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. ఓ ప్రముఖ దర్వకుడితో ఇప్పటికే బాలకృష్ణ సంప్రదింపులు జరిపినట్లుగా తెలియవస్తోంది. అతి త్వరలోనే సినిమాకి సంబంధించి పూర్తి వివరాల్ని బాలకృష్ణ ప్రకటించే అవకాశాలున్నాయి. ఏదేమైనప్పటికీ స్వర్గీయ ఎన్టీయార్ జీవిత చరిత్ర, తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో ప్రత్యేకం. లెజెండ్ ఎన్టీయార్ జీవిత చరిత్రను సినిమాగా చూసే అవకాశం దక్కడం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ మర్చిపోలేని తీపి గురుతే అవుతుంది.