హీరోయిన్ త్రిషకి జీవితంలో ఇంతకు ముందెన్నడూ చూడని కష్టం ఎదురైంది. అదే జల్లికట్టు వివాదం. పెటా కార్యకర్తగా త్రిష, జల్లికట్టుని వ్యతిరేకించడంతో ఆమెపై తమిళులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని త్రిష ఊహించలేదు. అయితే జరిగిన డ్యామేజీని కవర్ చేయడానికి త్రిష తల్లి ముందుకొచ్చారు. త్రిష, జల్లికట్టుని వ్యతిరేకించిందనే వార్తల్లో నిజం లేదన్నారు. కుట్రపూరితంగా త్రిషపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు కూడా చేశారు ఆమె తల్లి. ఇంకో వైపున త్రిష గురించి ఇకపై తన వద్ద మాట్లాడవద్దంటోంది. తమిళ ప్రజల సెంటిమెంట్లు గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందని త్రిష చెప్పింది. జల్లికట్టు తమిళనాడులో సంప్రదాయ క్రీడ అనీ, దానికి మద్దతిస్తున్నానని త్రిష వెల్లడించింది. దాంతో త్రిషకి వ్యతిరేకంగా నినదించిన జల్లికట్టు ఉద్యమకారులు శాంతించారు. ఇంకెప్పుడూ త్రిష పెటా జోలికి కూడా వెళ్ళదట. ఎందుకంటే పెటానే, జల్లికట్టుకి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని గతంలో ఆశ్రయించింది. అలాంటి చాలా ఫిర్యాదుల మేరకే సుప్రీంకోర్టు జల్లికట్టుని నిషేధించడం జరిగింది. సినీ రంగంలో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న త్రిషకి వివాదాలు కొత్త కాదు. అయితే ఈ వివాదం ఆమెను చాలా ఇబ్బందులకు గురిచేసింది. త్రిష ఒక్కరే కాదు, తమిళ సినీ పరిశ్రమలో చాలామంది 'పెటా' అంటే ఇప్పుడు భయపడుతున్నారట.