ఇప్పుడు ఎటు చూసినా 'బాహుబలి' ముచ్చట్లే. ఎక్కడ విన్నా టిక్కెట్ల గురించి పలు చర్చలే. 'బాహుబలి ది కన్‌క్లూజన్' సినిమా టిక్కెట్ ధర 3 వేల నుంచి 4 వేల రూపాయలదాకా పలుకుతోందట తెలుగు రాష్ట్రాల్లో. ఈ ధర ముంబై తదితర ప్రాంతాల్లోనూ ఇంచు మించు ఇలాగే ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 2 వేలకు అటూ ఇటూగా 'బాహుబలి' బ్లాక్ టిక్కెట్ ధర పలుకుతోందని సమాచారమ్. రికార్డు స్థాయిలో ఈ సినిమాని అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయినా సినిమా టిక్కెట్లు దొరకడంలేదు. ముందుగానే టిక్కెట్ల అమ్మకాలు పూర్తయిపోయాయి. కొన్ని చోట్ల ఇంకా అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు రాత్రి 9 గంటలకే హైదరాబాద్‌లో తొలి షో పడనుందట. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముందస్తు షోలకు అనుమతి ఇవ్వలేదని, అలా ఎవరైనా ముందస్తుగా షో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. కానీ ముందస్తు షోలకు టిక్కెట్లను ఇప్పటికే అమ్మేశారు. అలాగే టికెట్ల ధరల విషయంలో కూడా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ, ప్రేక్షకులకు ఇబ్బందుకుల కలగకుండా చేస్తున్నామనీ అంటున్నారు. కానీ అలాంటి పరిస్థితులేమీ కనబడడం లేదు. సరికదా టిక్కెట్లు దొరికినవారు తెలంగాణ ప్రభుత్వ ప్రకటనతో ఆందోళనలో ఉన్నారు. ఏదేమైనా 'బాహుబలి' మేనియా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. విడుదలకు ముందే మొదలైన ఈ రికార్డుల హోరు రేపు సాయంత్రానికి ఏ స్థాయిలో ఉండనుందో చూడాలిక.