శుక్రవారం విడుదలైన 'కాటమరాయుడు' సినిమా కేవలం మూడు రోజుల్లోనే 35 కోట్ల మార్క్ దాటేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. డివైడ్ టాక్‌తో ఈ స్థాయి వసూళ్ళు అంటే చాలా గొప్ప విషయంగా పరిగణించాలి. అయితే నేడే 'కాటమరాయుడు'కి అగ్ని పరీక్ష. వీకెండ్ ముగిసి సాధారణ రోజుల్లోకి వచ్చేయడంతో వసూళ్ళు ఎలా ఉంటాయన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఉగాది 28, 29 తేదీల్లో సమానంగా చేస్తుండడంతో రెండ్రోజుల పండగ 'కాటమరాయుడు'కి కలిసొస్తుందని ట్రేడ్ పండితులు చెప్పడం జరుగుతోంది. సోమవారం మినహాయిస్తే మళ్ళీ వీకెండ్ షురూ అయినట్లే భావించాలేమో. వసూళ్ళ జోరు కొనసాగిస్తే మాత్రం 'కాటమరాయుడు' ప్రభంజనం సృష్టించనుందనడం నిస్సందేహమేనట. ఓవర్‌సీస్‌లో ఇప్పటికే 1 మిలియన్ దాటేసింది 'కాటమరాయుడు'. వపన్‌కళ్యాణ్ సినిమాలకి అక్కడున్న క్రేజ్ అలాంటిది. తమిళ సినిమా 'వీరం'ని తెలుగులోకి రీమేక్ చేశారు. డబ్బింగ్ వెర్షన్ 'వీరుడొక్కడే' ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్ళలో మార్మోగిపోతున్నప్పటికీ కూడా 'కాటమరాయుడు'పై క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం గమనించదగ్గది. ఇంకో వైపున 'కాటమరాయుడు' సినిమాని పైరసీ చిదిమేసే ప్రయత్నం చేసింది. ఆలస్యంగా ఈ విషయంలో స్పందించిన చిత్ర యూనిట్, పైరసీపై ఉక్కుపాదం మోపడం ద్వారా 'కాటమరాయుడు'లో కొత్త ఉత్సాహం నింపాలనుకుంటున్న నేపథ్యంలో 'కాటమరాయుడు' ప్రభంజనం ఎలా ఉంటుందో ముందు ముందు తేలనుంది.