'కృష్ణాష్టమి', 'జక్కన్న', 'ఈడు గోల్డ్ ఎహె' సినిమాలతో ఫర్వాలేదన్పించినా, సునీల్ తన స్టామినాకి తగ్గ హిట్ ఈ మధ్యకాలంలో అందుకోలేకపోయాడు. ప్లానింగ్, టైమింగ్ విషయంలో కొంచెం తేడా కొట్టడమే దీనికి కారణం కావొచ్చేమో. సినిమాల్ని అనుకున్న టైమ్‌కి పట్టాలెక్కించలేకపోవడం, విడుదల చేయలేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని సమాచారమ్. గతంలో వచ్చిన ఈ సినిమాల విషయంలో సునీల్ అడుగడుగునా చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నాడు. ఈ సారి అలా కాదంట. చాలా పక్కాగా రావాలనుకుంటున్నాడు తన కొత్త సినిమాతో. సునీల్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఉంగరాల రాంబాబు'. ఈ సినిమా విషయంలో సునీల్ చాలా ప్లాన్డ్‌గా వ్యవహరిస్తున్నాడని తెలియవస్తోంది. అలాగే కథ విషయంలో ఇంతకుముందుకన్నా అలర్ట్ అయ్యాడట సునీల్. 'పూలరంగడు' తరహాలో కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ని సునీల్ చేస్తున్నాడట. 'పూల రంగడు' సినిమా సునీల్‌ని హీరో స్థాయిలో పర్‌ఫెక్ట్‌గా నిలబెట్టిన సినిమా. అందుకే అదే స్ధాయిలో 'ఉంగరాల రాంబాబు' విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడట. ఈ సినిమాతో సునీల్ తిరిగి రేసులోకి దూసుకొస్తాడని ఇన్‌సైడ్ బజ్ వినవస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో సునీల్ గెటప్‌తో సహా బాడీ లాంగ్వేజ్ కూడా ఛేంజ్ అయిపోయిందని అంటున్నారు. చాలా న్యూలుక్‌లో హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు సునీల్. 'ఉంగరాల రాంబాబు'లో సునీల్ సరసన మియా జార్జ్ హీరోయిన్‌గా నటిస్తోంది.