రాజు - పేద ప్రేమలు సినిమాల్లో చాలా చూసేశాం. అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న 'దొరసాని'లో కొత్తగా ఏం చూపించారంటే, పీరియాడిక్ కథతో ఈ సినిమాని తెరకెక్కించడం. అప్పటి తెలంగాణా నేటివిటీని కళ్లకు కట్టినట్లు చూపించడం వంటి అంశాలు ఈ సినిమాలో కొత్తగా ఉన్నాయి. ట్రైలర్‌లో థీమ్‌ని బాగానే రివీల్ చేశారు. కులాలు, కట్టుబాట్లు ఆ కాలంలో పేద, ధనిక మధ్య అంతరాలు ఎలా ఉండేవో ఈ సినిమాలో చూపించబోతున్నారు.
హీరో, హీరోయిన్లు ఇద్దరికీ ఈ సినిమా డెబ్యూ కావడంతో కథలో ఫ్రెష్‌నెస్ కనిపిస్తోంది. మామూలుగా ఉండే యాక్షన్ పెద్దగా లేకపోయినప్పటికీ, పేదోడైనా తన ప్రేమను గెలిపించుకోవాలనే కసిని హీరో క్యారెక్టర్ ద్వారా బాగా చూపించగలిగారు. హీరోగా ఆనంద్ దేవరకొండ, హీరోయిన్‌గా రాజశేఖర్ కుమార్తై శివాత్మిక నటించిన ఈ సినిమాకి కె.ఆర్. మహేంద్ర దర్శకుడు. ఆ కాలం నాటి తెలంగాణా నేటివిటీని డైరెక్టర్ అబ్జర్వ్ చేసిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. సినిమాకి శాంపిల్ అంతే. సినిమాలో సీను ఇంకా ఇంకా ఉంటుంది. ఇకపోతే 'దొరసాని' పాత్రలో శివాత్మిక ఒదిగిపోయింది. ఆనంద్ దేవరకొండ నటన పరంగా ప్రామిసింగ్‌గా అనిపిస్తున్నాడు. డైలాగ్ డెలివరీ, వాయిస్ తన అన్నయ్య విజయ్ దేవరకొండనే తలపిస్తోంది. మొత్తానికి 'దొరసాని' ట్రైలర్ ఆకట్టుకునేలానే ఉంది. సినిమాకి ఎన్ని మార్కులేస్తారో విడుదలయ్యాక కానీ తెలీదు.