సాయిధరమ్ తేజ్ కి రోడ్డు ప్రమాదం జరిగి చాలా రోజులైంది. ప్రమాదం వార్తని టీవీ ఛానళ్లు... జాతీయ సమస్య రేంజ్‌లో భావించి, కథనాలు అల్లేశాయి. ఆయా ఫుటేజీల వల్ల వాళ్లకు ఎంత మైలేజీ వచ్చిందో తెలీదు గానీ, తేజ్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దాంతో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు రోజు రోజుకీ ఓ హెల్త్ బులిటెన్ ని రిలీజ్ చేయడం మొదలెట్టాయి. చివరికి... తేజ్ కోలుకున్నాడని, కళ్లు తెరిచాడని, లేచి మాట్లాడుతున్నాడని, త్వరలో డిశ్చార్జ్ చేస్తారని - సెలవిచ్చారు. తేజ్ ని చూసొచ్చిన వాళ్లూ అదే అన్నారు.
అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలతో తేజ్ ఆరోగ్యంపై మరోసారి అనుమానాలు మొదలయ్యాయి. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చిన పవన్ కల్యాణ్ తేజ్ ఆరోగ్యంపై స్పందించాడు. తేజ్ ఇప్పటికీ కోమాలోనే ఉన్నాడని మాట్లాడాడు. దాంతో తేజ్ ఆరోగ్యంపై డాక్టర్లు విడుదల చేసిన బులిటెన్లన్నీ అబద్ధాలేనా? అనే అనుమానాలు మొదలయ్యాయి. నిజంగానే తేజ్ కోలుకుని ఉంటే, ఒక్క ఫొటో అయినా విడుదల చేసేవారు కదా? అని ఆరాలు మొదలయ్యాయి. పవన్ ఏ మూడ్ లో ఆ మాట చెప్పాడో గానీ, కొత్త అనుమానాలకు తావిచ్చినట్టైంది. తేజ్ త్వరగా కోలుకోవాలన్నది అభిమానుల అభిమతం. నిజంగా తేజ్ కోలుకుని ఉంటే, ఒక్క ఫొటో, ఒక్క వీడియో విడుదల చేస్తే... ఈ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. మరి... మెగా ఫ్యామిలీ ఏమనుకుంటుందో?