రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ఇచ్చిన స్పీచ్, చేసిన వ్యాఖ్యలు కాక పుట్టించాయి. అటు రాజకీయ వర్గాలు, ఇటు చిత్రసీమ ఈ వ్యాఖ్యలపై కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఏపీ మంత్రులు ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. పవన్ మోహన్ బాబుని ఉద్దేశించి కూడా కొన్ని కామెంట్లు చేశారు. `జగన్ మా బంధువులు అని అంటుంటారు కదా. మీరైనా చెప్పండి..` అంటూ ఆయన్నీ లాగారు. దాంతో మోహన్ బాబు స్పందించాల్సివచ్చింది.
” నా చిర కాల మిత్రుని కి సోదరుడైన పవన్ కళ్యాణ్, నువ్వు నాకంటే చిన్న వాడివి అందుకని ఏక వచనంలో సంబోధిస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీ లేదు . చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావు, సంతోషమే. ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడు అన్న సంగతి మీకు తెలిసిందే . అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి . ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాట కి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నీవు చేయవలసిన ముఖ్యమైన పని, నీ అమూల్యమైన ఓటు ని నీ సోదర సమానుడైన విష్ణు బాబు కు , అతని ప్యానల్ కి వేసి , వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను, థాంక్యూ వెరీ మచ్” అని పోస్ట్ చేశారు మోహన్ బాబు.
నేను త్వరతో స్పందిస్తా అని చెప్పడంలో ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే.. `మా` ఎన్నికల గురించీ, విష్ణుకి ఓటేయమని అడగడం గురించే అందరి అభ్యంతరమూ..? పవన్ మాట్లాడిందేమిటి? మీరు మాట్లాడుతున్నదేమిటి? అని సోషల్ మీడియాలో మోహన్ బాబుకి వ్యతిరేకంగా కౌంటర్లు పడుతున్నాయి. రోమ్ తగలడిపోతోంటే, ఫిడేలు వాయించినట్టు - తెలుగు చిత్రసీమ ఇప్పుడు సంక్షోభంలో ఉంటే, టికెట్ రేట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడితే - ఇలాంటప్పుడు కూడా మా ఎన్నికల గోలేంటి? అన్నదే అందరి ప్రశ్న. ఈ విషయంలో పవన్ కి ఉన్న మద్దతు... మోహన్ బాబుకి లేనట్టే అనుకోవాలి.