కొంతకాలం క్రితం టాలీవుడ్‌ని `డ్రగ్స్`కేసు షేక్ చేసేసింది. చాలామంది సినీ ప్రముఖుల పేర్లు ఈ వివాదంలో బయటకు వచ్చాయి. కొంతమంది సిట్ విచారణకు సైతం హాజరయ్యారు. వీళ్లందరినీ అరెస్టు చేస్తారేమో? అనే అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి. ఆ రోజుల్లో మీడియా చేసిన హడావుడీ అంతా ఇంతా కాదు.
సినీ సెలబ్రెటీలు ఇంటి దగ్గర మొదలైనప్పటి నుంచీ.. సిట్ విచారణకు హాజరయ్యేంత వరకూ లైవ్ కవరేజీలు ఇచ్చారు. లోపల ఏం జరిగి ఉంటుంది? అనే విషయంపై ప్రత్యేక కథనాలు అందించారు. అయితే... సిట్ ఈ కేసుని పక్కన పెట్టేసింది. ఆ తరవాత మళ్లీ డ్రగ్స్ కేసు గురించి ఏ ఒక్క విషయమూ బయటకు రాలేదు.
ఇప్పుడు ఈ తతంగం అంతా.. 'అమర్ అక్బర్ ఆంటోనీ'లో కనిపించబోతోందట. దీనిపై శ్రీనువైట్ల తనదైన శైలిలో సెటైర్ వేశాడట. హాస్య నటులు సునీల్, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డిలపై ఓ కామెడీ ట్రాక్ సృష్టించాడట శ్రీను. అది.. డ్రగ్స్ వ్యవహారాన్ని పోలి ఉంటుందని సమాచారం. కాకపోతే.. టాలీవుడ్‌లో సిట్... అమెరికాలో అక్కడి పోలీసులు అంతే తేడా!
సమకాలీన పరిస్థితులపై సెటైర్లు వేయడం శ్రీనువైట్లకుకొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేశాడు. ఈసారి డ్రగ్స్ ఉదంతాన్ని ఎంచుకున్నాడు. మరి ఆ ట్రాక్ ఎలా పండిందో.. ఎన్ని నవ్వులు పూయించిందో..??