తెలుగులో హీరోలకేం కొదవ లేదు. స్టార్ హీరోలు, టూ టైర్ హీరోలు, యంగ్ హీరోలు.. వీళ్లంతా కలుపుకొని... ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలు కనీసం 20మందైనా ఉంటారు. అయినా.. సరే, దర్శకులు, నిర్మాతలూ.. హీరోల డేట్ల కోసం పడిగాపులు కాయాల్సివస్తోంది. దానికి కారణం... సినిమా నిర్మాణం విపరీతంగా పెరిగిపోవడమే. ముఖ్యంగా టూ టైర్ హీరోలకు మంచి డిమాండ్ ఉంది. అందులోనూ లవ్ స్టోరీలు చేయగలిగి, యూత్ ని ఆకట్టుకోగలిగే కథానాయకులకు ఇప్పుడు మరింత గిరాకీ ఏర్పడింది. నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ.. వీళ్లంతా ఆ జాబితాలో కనిపించే హీరోలే. అయితే.. వీళ్లెవరూ ఇప్పుడు నిర్మాతలకు అందుబాటులో లేరు. వీళ్ల కాల్షీట్లు కావాలంటే.. కనీసం యేడాది నుంచి రెండేళ్ల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలోనే.. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు దుల్కర్ సల్మాన్..
మలయాళంలో మంచి మార్కెట్, యూత్ ఫాలోయింగ్ ఏర్పరచుకొన్న హీరో దుల్కర్ సల్మాన్. మల్లూవుడ్ లో తనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. తన సినిమాలు కొన్ని డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. `మహానటి`తో దుల్కర్ తొలిసారి స్ట్రయిట్‌గా ఓ తెలుగు సినిమా చేశాడు. ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలో కలకాలం నిలిచిపోయింది. అప్పటి నుంచీ.. దుల్కర్‌కి తెలుగులో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ.. ఏ సినిమాపైనా సంతకం చేయలేదు. ఎట్టకేలకు `సీతారామం` సినిమా ఒప్పుకొన్నాడు. వైజయంతీ మూవీస్ రూపొందించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. తెలుగులో ఇందమంది హీరోలున్నా - ఏరి కోరి మలయాళం నుంచి దుల్కర్‌ని తీసుకురావడం... ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అయితే.. `సీతారామం` టీజర్, ట్రైలర్ చూసినవాళ్లంతా... దుల్కర్ ఎంపిక నూటికి నూరు పాళ్లూ కరెక్టే అంటున్నారు. దుల్కర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకి ఓ కొత్త లుక్ తీసుకొచ్చిన మాట వాస్తవం. పైగా... ఈ సినిమాతో దుల్కర్ తెలుగులో మరింత బిజీ అవుతాడనిపిస్తోంది. ఇప్పటికే దుల్కర్‌తో సినిమాలు చేయడానికి కొంతమంది నిర్మాతలు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దుల్కర్ రాకతో, సెకండ్ టైర్ హీరోల ఆధిపత్యానికి కాస్త గండి పడినట్టే అనుకోవాలి. ఎందుకంటే.. ఇప్పుడు లవ్ స్టోరీలకూ దుల్కర్ మరో ప్రధానమైన ఆప్షన్‌గా మారబోతున్నాడు. మిగిలిన హీరోలతో పోలిస్తే.. తన పారితోషికం కూడా అందుబాటులోనే ఉంటుంది. పైగా... దుల్కర్‌ని సౌత్ లో మంచి మార్కెట్ ఉంది. సో.. నాని, విజయ్, శర్వా, వరుణ్ తేజ్ లాంటి యువ హీరోలకు దుల్కర్ నుంచి గండం పొంచి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.