'స్లో అండ్ స్టడీ... విన్ ద రేస్' ఇదీ రాజ్ కుమార్ హిరాణీ సినిమాల సిద్దాంతం. ఆయన సినిమాలన్నీ మెల్లమెల్లగా పుంజుకొని హిట్ బాట పడతాయి. ఇప్పుడు 'డంకీ' విషయంలోనూ అదే జరిగింది. షారుఖ్ ఖాన్ - రాజ్ కుమార్ హిరాణీ కాంబినేషన్లో రూపుదిద్దుకొన్న చిత్రమిది. ఈనెల 21న విడుదలైంది. విడుదల రోజున డివైడ్ టాక్ వచ్చింది. ఆ తరవాతే... సలార్ రావడంతో 'డంకీ` వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ దెబ్బకు దంకీ ఫ్లాపు లిస్టులో చేరిపోతుందనుకొన్నారంతా. కానీ 'డంకీ' అనూహ్యంగా పుంజుకొంది.
ఇప్పటి వరకూ దాదాపుగా రూ.230 కోట్ల వసూళ్లు సాధించింది. నెట్ చూసుకొంటూ అటూ ఇటుగా రూ.140 కోట్లు క్రాస్ అయ్యింది. 'డంకీ' బడ్జెట్ రూ.120 కోట్లు. ఇదంతా... నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఎప్పుడో దక్కేశాయి. ఎలా చూసినా.. 'డంకీ' లాభదాయకమైన ప్రాజెక్టే. క్లాస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. దీన్ని ఓ క్లాసిక్ అంటున్నారు బాలీవుడ్ జనాలు.
'సలార్' ఫీవర్ లో కూడా 'డంకీ' మంచి వసూళ్లు దక్కించుకొందంటే అది మామూలు విషయం కాదు. పైగా 'సలార్' పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. డంకీ కేవలం బాలీవుడ్ కే పరిమితమైంది. అందుకే ఈ రెండు సినిమాల మధ్య పోలిక తీసుకురావడం కూడా పొరపాటే! మొత్తానికి 'పటాన్', 'జవాన్'లతో రెండు వరుస విజయాలు అందుకొన్న షారుఖ్.. 'డంకీ'తో హ్యాట్రిక్ పూర్తి చేసుకొన్నాడు.