తారాగణం: అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు రమేష్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఛాయాగ్రహణం: అయాంకా బోస్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
కథ-కథనం: హరీష్ శంకర్, వేగేశ్న
నిర్మాత: దిల్ రాజు
మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్
యావరేజ్ యూజర్ రేటింగ్: 2.75/5
తెలుగు నాట కథలు ఇప్పుడిప్పుడే కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కథల్లో వైవిధ్యం లేకపోయినా... కనీసం క్యారెక్టరైజేషన్ పరంగానైనా కొత్తగా ట్రై చేస్తున్నారు మన కథానాయకులు. మూస ధోరణి నుంచి బయటకు వచ్చి హీరోయిజం పండిస్తున్నారు. స్టైలీష్ స్టార్‌గా పేరు తెచ్చుకొన్న అల్లు అర్జున్ కూడా.. 'దువ్వాడ జగన్నాథమ్' అనే బ్రాహ్మణ యువకుడిగా కనిపించడానికి ముందుకు రావడం అభినందించదగిన విషయమే. అయితే.. దానికి తోడు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పక్కాగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అదే.. 'డీజే'. గబ్బర్ సింగ్ లాంటి మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమాని అందించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. మరి వీరిద్దరి కాంబినేషన్ ఎలా సాగింది? 'డీజే' అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొన్నాడా, లేదా? అనేది తెలియాలంటే.. రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
దువ్వాడ జగన్నాథమ్ (అల్లు అర్జున్) విజయవాడ కుర్రాడు. నికార్సయిన బ్రాహ్మడు. అన్నపూర్ణ క్యారటరింగ్ పేరుతో వంటలు చేస్తుంటాడు. అయితే.. అప్పుడప్పుడూ హైదరాబాద్ వెళ్లి.. అక్కడ పోలీసుల సైతం ఛేదించలేని కేసుల్ని చక్కబెట్టుకొని వస్తుంటాడు. ఈ దశలో రొయ్యల నాయుడు (రావు రమేష్) తో తలపడాల్సివస్తుంది. దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల స్కామ్ కి ప్రధాన సూత్రధారి... రొయ్యల నాయుడు. ఈ స్కామ్‌ని డీజే ఎలా బయటపెట్టాడు? రొయ్యల నాయుడిని చట్టానికి పట్టించాడా, లేదా? అనేది కథ. ఇందులో పూజ (పూజా హెగ్డే)తో ప్రేమాయణం కూడా ఓ భాగమే. జగన్నాథమ్ ఇద్దరిలా ఎందుకు నటిస్తున్నాడు, దాని వెనుక గల కారణం ఏమిటి? ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎలా జాగ్రత్త పడ్డాడు? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
* నటీనటులు
దువ్వాడ జగన్నాథమ్ గా బన్నీ నటన కొత్తగా అనిపిస్తుంది. బ్రాహ్మిణ్ స్లాంగ్‌తో రచ్చ రచ్చ చేశాడు. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు వినిపించినా... ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇక డాన్సుల్లో మోత మోగించాడు. సిటీ మార్‌లో కొత్త స్టెప్పులు కనిపిస్తాయి. పూజా అందంగా కనిపించింది. ఈత కొలను దగ్గర పరిమితికి మించి అందాల్ని ఆరేసింది. బన్నీతో పాటు ఎనర్జిటిక్‌గా డాన్సులు వేసింది. రొయ్యల నాయుడు పాత్రలో రావు గోపాలరావుని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశాడు రావు రమేష్. అయితే ఆ పాత్రకు రాసుకొన్న సంభాషణలు బాగానే పేలాయి. మురళీ శర్మ ఓకే అనిపిస్తాడు. సుబ్బరాజు పాత్ర కాస్త వెరైటీగా అనిపిస్తుంది.
* విశ్లేషణ
కథగా చెప్పుకొంటే `డీజే` లో కొత్తదనం కనిపించదు. అన్ని సినిమాల్లానే ఇక్కడా హీరో - విలన్ మధ్య పోరాటమే కనిపిస్తుంది. అయితే.. కథానాయకుడి పాత్రల్లో రెండు షేడ్స్ ఉండడం, అందులో ఒకటి బ్రాహ్మణ యువకుడు కావడం, ఆ పాత్రని అల్లు అర్జున్ పోషించడం కొత్తదనం. అదే... ఈసినిమాకి ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. వినోదం అంతా దువ్వాడ జగన్నాథమ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ డీజే చూసుకొన్నాడు. ఇంట్రస్టింగ్ పాయింట్‌తో కథ మొదలవుతుంది. దువ్వాడగా బన్నీ చేష్టలు, మాటతీరు, డైలాగులు వినోదాన్ని పంచిపెడతాయి. పెళ్లిలో పూజాతో నడిపిన ప్రేమాయణం కూడా కాలక్షేపానికి పనికొస్తుంది. రొయ్యల నాయుడు ఎంట్రీతో కథ సీరియెస్ మూడ్‌లోకి దిగుతుంది. యాక్షన్ సీన్లు పక్కాగా ప్లాన్ చేసుకోవడం, పాటలు హుషారుగా సాగిపోవడం, విశ్రాంతి ముందు ఘట్టాలు పండడం వల్ల.. ఫస్టాఫ్ సాఫీగా సాగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో మళ్లీ ట్రాక్ ఎక్కడానికి మాత్రం దర్శకుడు సమయం తీసుకొన్నాడు. అయితే అక్కడక్కడ దువ్వాడ జగన్నాథమ్ నవ్వించే ప్రయత్నం చేస్తూ.. ఎంటర్‌టైన్‌మెంట్అందించాడు. పతాక సన్నివేశాల్లో ఫైట్ లేకుండా చూసుకోవడం బాగున్నా.. సుబ్బరాజుతో చేయించిన కామెడీ మాత్రం అతకలేదు. పైగా.. రొటీన్ పాయింట్ అవ్వడం - రొయ్యల నాయుడు పాత్రని అనుకొన్నంత బాగా తీర్చిదిద్దలేకపోవడం, సస్పెన్స్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం.. డీజేకి శాపాలుగా మారాయి. దువ్వాడ జగన్నాథమ్ పాత్ర, దాని చుట్టూ అల్లుకొన్న వినోదమే ఈ చిత్రాన్ని గట్టెక్కిస్తాయి.
* సాంకేతిక వర్గం
దేవి పాటల్లో కాస్త హుషారు తగ్గింది. స్పీడ్ పాటలే ఇచ్చినా వినగానే ఎక్కేసేలా లేవు. నేపథ్య సంగీతం అందరగొట్టాడు. కెమెరా వర్క్ డీసెంట్ గా సాగింది. దర్శకుడిగా కంటే రచయితగా హరీష్ శంకర్‌కి ఎక్కువ మార్కులు పడతాయి. సాధారమైన కథని ఎంచుకోవడం, అందులో పెద్దగా మలుపులు లేకపోవడం నిరాశ పరుస్తుంది. క్లైమాక్స్‌లో ఫైట్ లేకుండా చేయడం వరకూ ఓకే. కానీ... అక్కడ కామెడీ అంతగా పండలేదు.
* ప్లస్ పాయింట్స్
+ బన్నీ
+ డైలాగులు
+ పూజా గ్లామర్
* మైనస్ పాయింట్స్
- కథ, కథనం
- సెకండాఫ్
* ఫైనల్ వర్డిక్ట్:
నవ్వుకోవడానికి ఓకే..
రివ్యూ బై శ్రీ