ఈ సంక్రాంతికి మొదలైన రిలీజ్‌ల గొడవ... ఆ తరవాత 'ఈగల్' వెనక్కి వెళ్లడంతో సర్దుమణిగింది. అయితే... ఇప్పుడు ఫిబ్రవరి 9 రూపంలో మరోసారి ఈ గోల మొదలైంది. సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడం వల్ల 'ఈగల్'కి సోలో రిలీజ్ డేట్ ఇస్తామని ఫిల్మ్ ఛాంబర్ మాట ఇచ్చింది. అయితే ఫిబ్రవరి 9న రవితేజ సినిమాతో పాటుగా 'ఊరి పేరు భైవరకోన', 'యాత్ర 2', 'లాల్ సలామ్' వస్తున్నాయి. 'ఈగల్'కి ఇచ్చిన మాట ప్రకారం ఈ మూడు సినిమాలూ వెనక్కి వెళ్లాలి. కానీ అది అయ్యే పనేనా? 'యాత్ర 2'ని ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేస్తామంటూ నిర్మాతలు తేల్చేశారని సమాచారం. 'లాల్ సలామ్' అనేది ఓ డబ్బింగ్ సినిమా. పైగా రజనీకాంత్ సినిమా. దాన్ని ఆపగలరా? అయితే మూడో సినిమా 'ఊరు పేరు భైరవకోన'పై మాత్రం ఛాంబర్ పెద్దలు తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం.
'మేం వెనక్కి వెళ్తే.. యాత్ర 2, లాల్ సలామ్ సినిమాలూ రాకుండా ఉంటాయా?' అంటూ ఛాంబర్ పెద్దల్ని 'భైరవకోన' నిర్మాత రాజేష్ దండా అడిగితే అటు నుంచి సమాధానం రావడం లేదట. పైగా 'భైరవకోన' బిజినెస్ మొత్తం పూర్తయ్యింది. ఫిబ్రవరి 9 ఈ సినిమా రాకుండా వెనక్కి వెళ్తే.. ఇప్పుడు ఆ బిజినెస్ ఎగ్రిమెంట్ల గొడవ మొదలవుతుంది. 'ఫిబ్రవరి 9న రిలీజ్ కాకపోతే.. మేం అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకొంటాం' అని భైరవకోన నిర్మాతని బయ్యర్లు హెచ్చరిస్తున్నారు. వాయిదా పడితే.. వడ్డీల భారమూ పెరుగుతుంది. ఇవన్నీ దాటుకొని సినిమాని వాయిదా వేసినా... 'ఈగల్'కి ఇచ్చినట్టు 'భైరవ కోన'కూ సోలో రిలీజ్ డేట్ ఇస్తారా? ఇవ్వరు కదా? పైగా 'ఈగల్' అనేది ఓ పెద్ద సినిమా. ఆ సినిమాకు 'భైరవకోన'లాంటి చిన్న సినిమాని పోటీగా చూడడం ఏమిటి? మిగిలిన రెండు సినిమాల్నీ వదిలేసి కేవలం 'భైవరకోన' సినిమాపైనే ఛాంబర్ ఒత్తిడి తీసుకురావడం ఏమిటి? అనే చర్చ టాలీవుడ్ లో జోరుగా సాగుతోంది.