మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఇది వరకే చిరంజీవిని పద్మ భూషణ్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. పద్మ విభూషణ్ ప్రకటనతో చిరు కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరినట్టైంది. దశాబ్దాలుగా వెండి తెరపైచ తనదైన ముద్ర వేసిన చిరంజీవి, మదర్ థెరిస్సా స్ఫూర్తితో సామాజిన సేవలోనూ తన వంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి.. ఎన్నో ఏళ్లుగా తన వంతు సేవ చేస్తున్నారు. కరోనా సమయంలో సీసీసీ పేరుతో ఎంతోమందిని ఆదుకొన్నారు. ఆక్సిజన్ సిలెండర్లు కొరతగా ఉన్న సమయంలో.. చిరంజీవి ఛారిటబుట్ ట్రస్ట్ నుంచి ఎంతోమందికి సిలెండర్లు అందాయి.
అంతేకాదు.. చిత్రసీమకు ఏ కష్టం వచ్చినా, నేనున్నా అంటూ ఆదుకొన్న వైనాలు ఎన్నెన్నో. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించింది. చిరంజీవికి పద్మ విభూషణ్ వస్తుందని వారం రోజుల ముందు నుంచే ప్రచారం మొదలైంది. నిజానికి పద్మ అవార్డుల విషయంలో కేంద్రం చాలా గోప్యత పాటిస్తుంది. చివరి నిమిషం వరకూ అవార్డీలకు సైతం ఈ విషయం తెలీదు. అలాంటిది వారం రోజుల ముందే ఈ న్యూస్ బయటకు వచ్చేసింది. దాంతో ఈసారి పద్మ అవార్డులు ఎవరెవరికి ఇస్తారన్న విషయంలో ఆసక్తి నెలకొంది. చివరికి అందరూ ఊహించినట్టే.. మెగాస్టార్‌కు పద్మవిభూషణ్ వచ్చింది. చిరుకి కేంద్రం అవార్డు ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.