కత్తి మహేష్ మృతి ఇప్పుడు కొత్త అనుమానాలకు తావు ఇస్తోంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ గాయపడడం, శనివారం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం తెలిసిన విషయాలే. సోమవారం చిత్తూరు జిల్లా యలమందతో కత్తిమహేష్ అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి.
అయితే కత్తి మహేష్ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఈ కేసులో విచారణ జరిపించాలని కత్తిమహేష్ సన్నిహితులు, మాల -మాదిగ నాయకులు డిమాండ్ చేశారు. కత్తి మహేష్ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి తీరాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు.. ఆయనకు ఆక్సిజన్ అందలేదని, ఎవరో కావాలని ఆక్సిజన్ అందకుండా చేశారని, అందుకే ఈ మృతిపై విచారణ జరిపించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. సినీ విశ్లేషకుడిగా, సామాజిక వేత్తగా ఆయన చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. కత్తిమహేష్ పై చాలాసార్లు దాడి కూడా జరిగింది. కావాలని ఎవరైనా కత్తి మహేష్ ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చారా? చెన్నైలోని ఆసుపత్రి వరకూ వెళ్లి.. మహేష్ ప్రాణాలు పోవడానికి కారణమయ్యారా? అనే దిశగా విచారణ జరిపించాలని కత్తిమహేష్ సన్నిహితులు కోరుతున్నారు.