ఈ సంక్రాంతికి 4 సినిమాలొస్తున్నాయి. అయితే అందరి దృష్టీ 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాలపైనే ఉన్నాయి. రెండూ పెద్ద సినిమాలు. పైగా విడుదలకు ముందు నువ్వా? నేనా? అన్నట్టు పోటీ సాగింది. పైగా రెండు సినిమాల మధ్య ఒకే ఒక్క రోజు తేడా వుంది. వీటితో పాటు విడుదల అవుతున్న 'దర్బార్', 'ఎంత మంచి వాడవురా' సినిమాలపై ఎలాంటి బజ్ లేదు. ప్రచారంలో, క్రేజ్‌లో పోలిస్తే ఈ రెండు సినిమాలకంటే వెనకే ఉన్నాయి. అయితే సైలెంట్‌గా రావడమే ఈ రెండు సినిమాలకూ చాలా మంచిది. ఎలాంటి అంచనాలూ లేకుండా విడుదల అవ్వడం వల్ల, కాస్త బాగున్నా, జనాలకు నచ్చేసే అవకాశం ఉంది.
గతంలో 'శతమానంభవతి' కూడా ఇలానే ఎలాంటి హడావుడీ లేకుండా విడుదలై, సంచలనం సృష్టించింది. ఈసారి 'ఎంత మంచివాడవురా' కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేసే అవకాశాలూ కొట్టిపరేయలేం. పైగా ఈ రెండు సినిమాలకూ సతీష్ వేగేశ్ననే దర్శకుడు. ఇక 'దర్బార్' సంగతి సరే సరి. వరుస ఫ్లాపులతో రజనీకాంత్ క్రేజ్ తగ్గి ఉండొచ్చు. కాకపోతే... తనదైన రోజున రజనీ తన తడాఖా చూపించడం ఖాయం. సో.. ఈ రెండు సినిమాలూ సంక్రాంతి విజేతలుగా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.