RRR కి ఎదురవుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. కాకపోతే.. సీత కష్టాలు సీతవన్నట్టు... RRR కీ కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో టికెట్ రేట్ల సమస్య ఇంకా తెగలేదు. ఢిల్లీలో థియేటర్లు బంద్ అయ్యాయి. ముంబైలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన ఉంది. ఇవన్నీ ఆర్.ఆర్.ఆర్ జోరుని అడ్డుకునేవే.
అయితే ఇప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఆర్.ఆర్.ఆర్‌కి గట్టి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. కొంతమంది బయ్యర్లు ఈ సినిమాని ఎక్కువ రేటు పెట్టి కొన్నామని, ఇప్పుడు టికెట్ రేట్లు తగ్గిపోయాయి కాబట్టి, ఇచ్చిన సొమ్ములో కొంత వెనక్కి ఇచ్చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ముంబైలో ఈ సినిమా కొన్న బయ్యర్లు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్న కరణ్ జోహార్.. అక్కడి బయ్యర్లతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇక్కడ మాత్రం నిర్మాత డి.వి.వి. దానయ్య కాల్ తీసుకోవాల్సివుంది. ఆంధ్రాలో టికెట్ రేట్లు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో... తాము ఇచ్చిన సొమ్ములో 50 శాతం వెనక్కి ఇవ్వాలన్నది బయ్యర్ల డిమాండ్. జనవరి 7న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈలోగా.. ఈ మ్యాటర్ సెటిల్ అవ్వాలి. లేదంటే ఏపీలో ఈ సినిమా కొన్న బయ్యర్లు... తమ ఆందోళని ఉధృతం చేసి, తమ డిమాండ్ ని ఇంకాస్త గట్టిగా వినిపించే అవకాశం ఉంది.