హిందువులకు పరమ పవిత్రమైన గాధ 'మహాభారతం'. ఈ మహాద్భుత గాథని సినిమాగా తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతుండగా, తాజాగా ఈ సినిమా తెరకెక్కేందుకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. యూఏఈకి చెందిన భారతీయ వ్యాపారవేత్త బి.ఆర్.శెట్టి నిర్మాణంలో ఈ సినిమాకి దృశ్య రూపం ఇచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. 2018లో సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ అయిన 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందబోతోంది. 2020లో సినిమా విడుదలవుతుంది. రెండు పార్ట్‌లుగా ఈ సినిమాని రూపొందించాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది. మొదటి భాగం విడుదలైన 100 రోజుల్లో అంటే మూడు నెలల అనంతరం రెండో పార్ట్ విడుదల కానుందట. అలూ లేదు చూలు లేదు కానీ, అల్లుడు పేరు సోమలింగం అన్నట్లుగా ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు కానీ, వసూళ్ల లెక్కలు మాత్రం షురూ చేసేశారు అప్పుడే. ఈ సినిమా 6,800 కోట్ల రూపాయల్ని వసూలు చేస్తుందని నిర్మాత అంచనా వేస్తున్నారు. సినిమాలో తారాగణమెవరో ఇంకా తెలియదు. సెట్స్ మీదకు వెళ్ళకుండానే వసూళ్ళ అంచనాలు. పక్కా ప్రణాళిక మార్కెటింగ్ వ్యూహాలుండొచ్చుగానీ, మరీ ఇంత అత్యాశ తగదు. వి.ఎ.శ్రీకుమార్ మేనన్ ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ భీముడి పాత్రలో నటించనున్నాడు.