సినీ తారలను అసభ్యంగా చూపిస్తున్నారన్న కారణంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పలు సినీ వెబ్‌సైట్లపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఐడీ పోలీసులు పలు వెబ్‌సైట్లపై కేసు నమోదు చేశారు. సినీ తారల చిత్రాలను మార్ఫింగ్ చేసి, వారిపై అసభ్యకరమైన కథనాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆ కారణంగా వారి వ్యక్తిగత పరువుకు భంగం కలుగుతోందంటూ అలాంటి వెబ్‌సైట్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనీ మూవీ ఆర్టిస్ట్స్ ప్రతినిధులు ఆ ఫిర్యాదులో తెలిపారు. వాస్తవానికి సదరు వెబ్ సైట్లపై తమకేం అభ్యంతరాల్లేవనీ, పత్రికా స్వేచ్ఛని మేం గౌరవిస్తామనీ అయితే వ్యక్తిగత ప్రతిష్ఠకి భంగం కలగడాన్ని ఓర్చుకోలేకపోతున్నామని 'మా' ప్రతినిధులైన శివాజీ రాజా, మురళీమోహన్ తదితరులు అంటున్నారు. అవును నిజమే, సినీ సెలబ్రిటీస్‌పై గాసిప్స్ కామనే. అలాంటి గాసిప్స్‌నీ మేం పట్టించుకోమనీ వారు తెలిపారు. అయితే తమకీ ఓ లైప్ ఉంటుంది. ఆ వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా వ్యవహరిస్తే అభ్యంతరం తెలుపుతామని వారు అన్నారు. యూ ట్యూబ్ ఛానెల్స్ వల్లే ఈ నష్టం ఎక్కువగా కలుగుతోందనీ వారు తమ ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదు ప్రకారం ఆ తరహా వెబ్‌సైట్లలో 200కు పైగా వెబ్‌సైట్స్‌పై కేసులు నమోదు చేశారు సైబర్ పోలీసులు. సదరు వెబ్‌సైట్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ సైబర్ పోలీసులు తెలిపారు.