రవితేజకూ, రమేష్ వర్మకూ ఓ అవినావభావ సంబంధం ఉంది. 'వీర', 'ఖిలాడీ' సినిమాలు వీరిద్దరి కాంబోలో వచ్చాయి. రెండూ సరిగా ఆడలేదు. కానీ.. రమేష్ వర్మపై రవితేజ నమ్మకం ఉంచుతూనే ఉన్నాడు. ఇప్పుడు తన తమ్ముడు కొడుకు మాధవ్ ని రమేష్ వర్మ చేతుల్లోనే పెట్టాడు. రమేష్ వర్మ సమర్పణలో 'ఏయ్ పిల్లా' అనే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. అందులో మాధవ్ హీరో. ఈ చిత్రానికి రమేష్ వర్మ కథని అందించడం విశేషం.
లుధీర్ బై రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నల్లమలపు బుజ్జీ నిర్మాత. మంగళవారం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన రూబల్ షికావత్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది.
ఇదో పల్లెటూరి ప్రేమ కథ. పోస్టర్ పై.. హీరో, హీరోయిన్లు చూడ్డానికి రొమాంటిక్ గా, క్యూట్ గా ఉన్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వచ్చేనెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. 'ఎపిక్ లవ్ స్టోరీ' అంటూ ముందు నుంచే చిత్రబృందం ఊరించడం మొదలెట్టింది. పల్లెటూరి నేపథ్యంలో ఓ చక్కటి ప్రేమ కథ వచ్చి చాలా కాలమైంది. మళ్లీ.. అలాంటి ప్రయత్నం ఏదో చేస్తున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.