ఆర్.ఆర్.ఆర్ తరవాత కొరటాల శివతో చేయాలని ఎన్టీఆర్ ఎప్పుడో ఫిక్సయ్యాడు. ఆర్.ఆర్.ఆర్ వచ్చి, వెళ్లిపోయింది కూడా. కానీ కొరటాల సినిమా ఇంకా మొదలుకాలేదు. ఆర్.ఆర్.ఆర్ అవ్వగానే రామ్ చరణ్ శంకర్ సినిమాతో బిజీ అయిపోతే, ఎన్టీఆర్ మాత్రం చాలా టైమ్ తీసుకుంటున్నాడు. జులైలో కొరటాల సినిమా పట్టాలెక్కుతుందన్నారు. కానీ అవ్వలేదు. ఆగస్టులోనూ ఈసినిమా మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దానికి బోలెడన్ని కారణాలున్నాయి.
ఒకటి.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గాలి. ఆ ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. రెండో కారణం ఏమిటంటే, ఎన్టీఆర్ భుజం నొప్పితో బాధ పడుతున్నాడు. తనకు కనీసం మూడు వారాలు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పారు. అంటే.. ఈ నెలలో కూడా ఎన్టీఆర్ సినిమా మొదలవ్వదు. అత్యంత ముఖ్యమైన మరో కారణం ఏమిటంటే.. ఈ సినిమా స్క్రిప్టు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. మార్పులూ చేర్పులూ జరుగుతూనే ఉన్నాయి.
ఆచార్య ఫ్లాప్‌తో కొరటాల మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సివస్తోంది. అందుకే ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొన్న తరవాతే సీన్ ఓకే చేస్తున్నార్ట. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఒకసారి పట్టాలెక్కిన తరవాత నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతుందని, కాస్త ఆలస్యమైనా త్వరగానే ఈ సినిమాని ఫినిష్ చేస్తారని ఇన్ సైడ్ వర్గాల టాక్.