అనుకున్నదే అవుతోంది. 2022 సంక్రాంతి బరి నుంచి కొన్ని సినిమాలు తప్పుకోవడం ఖాయమని ఫిల్మ్‌నగర్ లో టాక్ వినిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఎఫ్ 3 సినిమా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంది. 2022 సంక్రాంతికి ఎఫ్ 3 వస్తుందని చిత్రబృందం ముందే చెప్పింది. అయితే... ఈ సంక్రాంతి కి పోటీ మామూలుగా ఉండడం లేదు. ఆర్.ఆర్.ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్, సర్కారు వారి పాట విడుదల అవుతున్నాయి. ఈ నాలుగు సినిమాల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. నాలుగూ.. పెద్ద సినిమాలే. వీటి మధ్య మరో సినిమా నిలబడడం చాలా కష్టం. అందుకే ఎఫ్ 3 తప్పుకుంది.
ఈ చిత్రాన్ని ఫిబ్రరి 25న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ``సంక్రాంతికి మా సినిమాని విడుదల చేద్దామనుకున్నాం. కానీ కుదర్లేదు. అయినా బాధ లేదు. ఎందుకంటే.. కొన్ని సినిమాలకు సీజన్ తో పనిలేదు. ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు చూస్తారు. అలాంటి సినిమానే ఇది`` అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. తమన్నా, మెహరీన్ కథానాయికలు. సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.