కత్తి మహేష్ గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కత్తి మహేష్ కి అయిన గాయాలుతీవ్రమైనవి. పలు ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన దృష్ట్యా.. చికిత్సకు భారీ ఎత్తున ఖర్చు అవ్వనుంది. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ కి సాయం చేయడానికి పలువురు ముందుకొస్తున్నారు. పవన్ కల్యాణ్ సైతం కత్తి మహేష్ కి ఆర్థిక సహాయం చేశాడని, ఆసుపత్రి బిల్లు మొత్తం భరించడానికి ముందుకొచ్చాడని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ వార్తల్ని కత్తి మహేష్ సన్నిహితులు ఖండించారు.
కత్తి మహేష్ వైద్య ఖర్చులన్నీ కుటుంబ సభ్యులు, స్నేహితులే భరిస్తున్నారని, ఎవరి దగ్గరి నుంచి పైసా ఆర్థిక సహాయం కోరలేదని, మహేష్ కి సహాయం చేయడానికి చాలామంది ముందుకొచ్చినా.. ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని, అవసరమైతే.. అడుగుతామని కత్తి మహేష్ సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం కత్తిమహేష్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. కంటికి తీవ్రమైన గాయం అవ్వడంతో మహేష్ కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో పడ్డాడని ప్రచారం మొదలైంది. దీనిపై వైద్యులు ఓ క్లారిటీ ఇవ్వాల్సివుంది.