సినీ హీరోలకి అభిమానులు సర్వసాధారణం. ఆ అభిమానులు తమ అభిమాన హీరోపై అభిమానాన్ని చాటుకోవడంలో ప్రత్యేకతను ప్రదర్శిస్తుండడం అభినందనీయం. ఓ హీరో అభిమానులు ఇంకో హీరో అభిమానులపై గొడవ చేయడం ద్వారా ఆయా హీరోలకే మచ్చ తెస్తుంటారు. కానీ కొందరు మాత్రం అలా కాదు. సేవా కార్యక్రమాలతో తమ అభిమాన హీరోలకు మంచి పేరు తెచ్చే అభిమానులు కూడా ఉంటారు. అలాంటివారిలో ఒకరు గోపీచంద్. హైద్రాబాద్ కూకట్‌పల్లిలోని ఓ థియేటర్‌లో సినిమా టిక్కెట్‌ని ఒక లక్ష రూపాయలకు ఖరీదు చేశాడీయన. ఆ మొత్తాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ పని చేసినట్లు చెప్పాడు గోపీచంద్. ఎంత గొప్ప విషయమో కదా! సినిమా రిలీజ్ అంటే హంగామా చేయడమొక్కటే కాదు, సేవా కార్యక్రమాలతో తమ అభిమాన హీరో స్థాయిని పెంచడం కూడా అని గోపీచంద్ నిరూపించాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి గొప్ప అభిమానులు ఉండడం బాలయ్య అదృష్టంగా చెప్పవచ్చు. అందుకే ఈ బాలయ్య అభిమానిని గురించి చెప్పుకోకుండా ఉండలేము. మరో పక్క అభిమానులు ఆశించినట్లుగానే 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా ఆ స్థాయిని అందుకుంది. బాలయ్య యాక్షన్‌కీ, క్రిష్ డైరెక్షన్‌కీ ప్రశంసల వర్షం కురుస్తోంది. నిజంగానే సంక్రాంతికి విడుదల కావాల్సిన ఓ మంచి సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' అంటూ అభిమానులతో పాటు, సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారు.