సోష‌ల్ మీడియాలో 'ఫ్యాన్' వార్ మొద‌లు

మరిన్ని వార్తలు

నా హీరోనే హీరో.. నీ హీరో జీరో - అని చంక‌లు గుద్దుకునే దురాభిమానులు మ‌న‌కు క‌నిపిస్తూనే ఉంటారు. మ‌రో హీరో అభిమానిని కెలికి - కాల‌క్షేపం చేస్తుంటారు. గ‌త కొంత‌కాలంగా ఇలాంటి ఫ్యాన్ వార్‌లు మ‌న‌కు బొత్తిగా క‌నిపించ‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ ఆ యుద్ధం రేగింది. ఎలాంటి అవ‌కాశం దొరుకుతుందా, రెచ్చిపోదామా? అని ఎదురు చూస్తే దుర‌భిమానులు ఇప్పుడు సోష‌ల్ మీడియా సాక్షిగా చెల‌రేగిపోతున్నారు.

 

ఇండ్ర‌స్ట్రీకీ - ప్ర‌భుత్వానికీ మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌కు త‌న‌ని పిల‌వ‌క‌పోవ‌డం ప‌ట్ల నంద‌మూరి బాల‌కృష్ణ బాహాటంగానే త‌న అసంతృప్తి వెళ్ల‌గ‌క్కిన సంగ‌తి తెలిసిందే. చిరు అండ్ కోని ఉద్దేశించి ఓ బీప్ కూడా వాడాడు. దాంతో నాగ‌బాబు కూడా ధీటుగా స్పందించాడు. బాల‌య్య క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, నోటికి ఎంతొస్తే అంత వాగ‌డం క‌ట్టి పెట్టాల‌ని గ‌ట్టి వార్నింగు ఇచ్చాడు. దాంతో ఇప్పుడ మెగా - నంద‌మూరి అభిమానుల మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఫ్యాన్ వార్ మొద‌లైంది.

 

కొంత‌మంది బాల‌య్య‌ని ట్రోల్ చేస్తుంటే ఇంకొంత మంది నాగ‌బాబు, చిరంజీవిల‌పై ట్రోలింగ్‌కి దిగారు. నువ్వా? నేనా? అన్న‌ట్టు సాగుతున్నాయి ఆ కామెంట్లు. బాల‌య్య‌ని ఆహ్వానించ‌క‌పోవ‌డం చిరంజీవి త‌ప్పా? దాన్ని బాహాటంగా చెప్పి, నోరు జార‌డం బాల‌య్య తప్పా? స‌ంయ‌మ‌నం పాటించ‌కుండా వీడియో వ‌ద‌ల‌డం నాగ‌బాబు త‌ప్పా? అనేది పక్క‌న పెడితే.. వీళ్ల గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొట్టుకోవ‌డం ముమ్మాటికీ త‌ప్పే. చివ‌రికి హీరోలంతా బాగానే ఉంటారు. ఆవేశాల‌కు పోయి... అభిమానులే న‌ష్ట‌పోతారు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS