జీన్స్ ప్యాంటేశాక, దాని మీద వోణీ కడితే ఎలా ఉంటుంది? ఇలాంటి చిలిపి ఐడియాలు సీనియర్ దర్శకుడు వంశీకి కాక ఇంకెవరికొస్తాయ్? అందుకే వంశీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ స్పెషల్. హీరోయిన్లని డిఫరెంట్‌గా చూపించడంలోనూ, గోదావరి అందాల్ని అత్యద్భుతంగా చూపడంలోనూ వంశీ స్టైలే వేరు. 'ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్' సినిమాలో వంశీ చాలా చాలా వింతలు చూపించబోతున్నారు. మచ్చుకి ఇదిగో అంటూ ఓ సాంగ్ లిరికల్ వీడియో (ఆడియో సింగిల్) విడుదల చేశారు. సాంగ్‌లో హీరోయిన్, జీన్స్ ప్యాంటేసుకుని, దాని మీద వోణీ వేసుకుని వెరైటీ గెటప్‌లో కన్పిస్తోంది. హీరోయిన్ గ్లామర్ ఓ వైపు, గోదావరి అందాలు ఇంకో వైపు. వెరసి పాట సరికొత్త అందాన్ని సంతరించుకుంది. ఫ్యాషన్ డిజైనర్ అన్నారు కదా అని, ఇదేదో పూర్తిగా సిటీ నేటివిటీతో కూడుకున్న సినిమా అనుకునేరు. అదీ ఇదీ అన్నీ ఉంటాయట. వంశీ సినిమాలో గోదావరి లేకపోతే ఎలా? అక్కడే కీలకమైన సన్నివేవాల్ని చిత్రీకరించారు. సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సుమంత్ అశ్విన్ సరసన ఈ చిత్రంలో అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస హీరోయిన్లుగా నటిస్తున్నారు. కడుపుబ్బా నవ్వించే కామెడీతోపాటు, యూత్‌నీ, ఫ్యామిలీనీ అలరించే మంచి కథ, కథనాలతో రూపొందిన 'ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్' సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది.