కరోనా... కనీవినీ ఎరుగని ఉపద్రవాన్ని సృష్టిస్తోంది. ఉద్యోగాలు పోతున్నాయి. ప్రణాళికలు పల్టీలు కొడుతున్నాయి. సర్వ సుఖాలు తరవాత.. ముందు ప్రాణాలతో ఉంటే చాలు అనిపించే స్థితికి మార్చేస్తున్నాయ్. అన్ని రంగాల్లోనూ ఇంతే. సినిమా అందుకు అతీతం కాదు. ప్రత్యక్షంగా పరోక్షంగా సినీ పరిశ్రమపై ఆధారపడేవాళ్లు వేలల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్లంతా కరోనా బాధితులే. సినిమాల్లేవు. షూటింగులు లేవు. సినిమా ఆఫీసులకు తాళాలు వేసేశారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, కథానాయకులు, ఇతర నటీనటుల వ్యక్తిగత సిబ్బందికి పనులు లేకుండా పోయాయి. వాళ్లంతా ఇప్పుడు తాత్కాలిక నిరుద్యోగుల జాబితాలో చేరిపోయారు.
చిత్రసీమకు ఫిల్మ్‌నగర్ అడ్డా. సహాయ దర్శకుల దగ్గర్నుంచి, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర్నుంచి, రచయితలుగా, నటీనటులుగా, దర్శకులుగా, సంగీత దర్శకులుగా తమని తాము నిరూపించుకోవాలని అనుకునే యువతీ యువకుల ప్రస్థానం ఫిల్మ్‌నగర్ నుంచే ప్రారంభం అవుతుంది. ఏ నలుగురు కాఫీ షాప్‌లో కలుసుకున్నా - సినిమా సంగతులే వినిపించేవి. కొత్త కథలు వినిపించేవి. ఇప్పుడు ఆ ఊసులు... ఆ వైభవం, ఉత్సాహం లేదు. గత మూడు నెలలుగా షూటింగులు లేకపోవడంతో వాళ్లంతా ఖాళీ. ఇప్పుడు ఏకంగా ఫిల్మ్‌నగర్‌నే ఖాళీ చేసేసి, సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. ఫిల్మ్‌నగర్, కృష్ణా నగర్, యూసుఫ్ గుడా ప్రాంతాలలో అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టం. అక్కడంతా సినీ శ్రమైక జీవులే ఉంటారు. వాళ్లంతా ఇల్లు ఖాళీ చేసేయడంతో... ఆయా ప్రాంతాలు బోసిగా మారిపోయాయి. ప్రతి ఇంటి ముందు టులెట్ బోర్డులు వేలాడుతున్నాయి. చిన్నచిన్న టెక్నీషియన్లు, లైట్ బోయ్స్, మేనేజర్స్, ప్రొడక్షన్ టీమ్ - వీళ్లంతా సినిమా పరిశ్రమకు కనిపించని బలం. తెర వెనుక వీళ్లు లేకపోతే సినిమా నడవడం కష్టం.
అయితే ఇప్పుడు వీళ్లంతా ఫిల్మ్‌నగర్‌ని ఖాళీ చేసేశారు. `షూటింగులు మొదలయ్యేటప్పుడు వద్దాంలే` అంటూ ప్రత్యామ్నాయ వ్యాపకాలలో మునిగిపోయారు. నిజానికి ఇప్పటికిప్పుడు షూటింగులు మొదలలైనా కావల్సిన సంఖ్యలో సిబ్బంది దొరకడం కష్టంగా మారే పరిస్థితి వచ్చేసింది. ఆగస్టు - సెప్టెంబరు నెలల్లోనూ షూటింగులు మొదలవ్వడం కష్టమే అనిపిస్తోంది. 2020 మర్చిపోవాల్సిందే అని చిత్రసీమ ప్రముఖులు కూడా అభిప్రాయ పడుతున్నారు. ఫిల్మ్‌నగర్ మళ్లీ కళకళలాడేదెప్పుడో.. ఆ వైభవం మళ్లీ చూసేదెప్పుడో?