టాలీవుడ్ మొత్తం హైదరాబాద్ చుట్టూనే పరిభ్రమిస్తుంటుంది. చిత్రసీమకు హైదరాబాద్ ఓ అడ్డా. కేరాఫ్ అడ్రస్స్. స్టూడియోలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఇండోర్, అవుడ్డోర్.. ఎప్పుడైనా, ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా పర్మిషన్లు కూడా ఈజీగా దొరుకుతాయి. హీరోలు, హీరోయిన్లూ.. ఇక్కడే మకాం పెట్టేశారు. అందుకే హైదరాబాద్ చిత్రసీమకు పెద్ద దిక్కుగా మారిపోయింది.
అయితే.. ఇప్పుడు టాలీవుడ్‌కి విశాఖపై మనసు మళ్లింది. అక్కడ కొత్త స్టూడియోలు నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. ఇది వరకెప్పుడో విశాఖ పరిసరాల్లో స్టూడియోలు నిర్మించుకోమని ప్రభుత్వం స్థలాలు ఇవ్వడానికి రెడీ అయినా, `వద్దు...` అన్నవాళ్లు, ఇప్పుడు విశాఖలో స్టూడియోలు కట్టుకోవడానికి ఎగబడుతున్నారు. విశాఖ పరిసరాల్లో రామానాయుడు స్టూడియో ఉంది. ఇప్పుడు సురేష్ బాబు అక్కడ మరో స్టూడియో కట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. విశాఖకి కాస్త దూరంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి చెందిన స్థలాలున్నాయి. అందులో చిరంజీవి ఓ స్టూడియో నిర్మిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు విశాఖలో స్టూడియో నిర్మించడానికి అనుమతుల కోసం చిరంజీవి జగన్‌తో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణకీ ఓ స్టూడియో నిర్మించే ఆలోచన ఉందని, నాగార్జున కూడా అన్నపూర్ణ స్టూడియో బ్రాంచ్‌ని వైజాగ్‌లో స్థాపించాలని చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్ విశాఖ షిఫ్ట్ అవ్వడానికి రంగం రెడీ చేసుకుంటోందన్నమాట. మరి ఎవరు ఎప్పుడు ఎక్కడ స్టూడియోలు నిర్మిస్తారో చూడాలి.