నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం అఖండ. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మంచి టాక్ వచ్చింది. థియేటర్లన్నీ అభిమానుల కోలాహలంతో నిండిపోయాయి. అయితే.. ఓ థియేటర్లో మాత్రం అగ్నిప్రమాదం సంభవించి - ప్రేక్షకుల్ని కంగారు పెట్టింది.
ఈ షాకింగ్ ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న జెమిని థియేటర్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ప్రేక్షకులు సినిమా చూస్తుండగా.. ఒక్కసారిగా థియేటర్లో పొగలు అలుముకోవడంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సిఉంది.