'పూర్ణోదయ క్రియేషన్స్' అంటేనే క్లాసిక్స్. లెజండరీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆ బ్యానర్ లో చేసిన సినిమాలన్నీ ఎంతో గౌరవం తెచ్చుకున్నాయి. కొన్ని సినిమాలు కమర్షియల్ గా ఆడలేదు కానీ గౌరవం మాత్రం ఎక్కడా తగ్గలేదు. అలాంటి సంస్థ పేరుని వాడుకొని సినిమా తీస్తున్నపుడు ఎంత జాగ్రత్తగా వుండాలి? స్వయంగా ఏడిద నాగేశ్వరరావు మనవరాలే ఒక సినిమాని నిర్మిస్తున్నపుడు కథ విషయంలో ఇంకెంత శ్రద్ధ వహించాలి? కానీ `ఫస్ట్ డే ఫస్ట్ షో`కి అలాంటి జాగ్రత్త, శ్రద్ధ కనిపించలేదు.
'పూర్ణోదయ' బ్యానర్ పేరుని వాడుకొని ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా తీసిన సినిమా `ఫస్ట్ డే ఫస్ట్ షో`. 'జాతి రత్నాలు' అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ లాంటి హేమాహేమీలని ప్రమోషన్స్ లో భాగం చేశారు. పూర్ణోదయ పై వున్న గౌరవంతో పిలవగానే అందరూ వచ్చారు. అయితే ప్రమోషన్స్ పై వున్న శ్రద్ధ కంటెంట్ పై తీసుకోలేదు. ఖుషి సినిమా తొలిరోజు టికెట్లు అనే చిన్న లైన్ ని పట్టుకొని సినిమాని నడిపేయాలని చూశారు. ఈ లైన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. ఆ అతి డ్రామాని పవన్ ఫ్యాన్సే ఆక్షేపించిన పరిస్థితి. మొత్తానికి `ఫస్ట్ డే ఫస్ట్ షో` ఫస్ట్ షో తర్వాత ఇంక కనిపించలేదు.
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి.. శ్రీజకి ఒక సలహా ఇచ్చారు. ''పూర్ణోదయ పేరు వాడుతున్నపుడు కథలు విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి'' అన్నారు. శ్రీజ ఈ సలహాని పాటించాలి. కథ ఓకే చేసినపుడు ఒకటికి పదిసార్లు అలోచించాలి. 'పూర్ణోదయ' గౌరవం పెంచే కథలు చేయాలి.