పురాణాల్లో హనుమంతుడి పాత్రకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తను శ్రీరాముడికి వీర భక్తుడు. మన ఇతిహాసాల్లో కనిపించే సూపర్ హీరో తానే. బహుశా హాలీవుడ్ సినిమాలు స్పైడర్ మాన్, బ్యాట్‌మెన్, సూపర్ మెన్ పాత్రలకు తనే స్ఫూర్తి కావొచ్చు. హనుమంతుడి ఇతివృత్తంతో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. అయితే.. హనుమంతుడ్ని సూపర్ హీరోగా చూపిస్తూ ఒక్క సినిమా కూడా రాలేదు.
తెలుగులో ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. అ, కల్కి, జాంబీరెడ్డి సినిమాలతో తన స్పెషాలిటీ చూపించుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా విశేషాల్ని ప్రకటిస్తూ.. ఓ చిన్న టీజర్ విడుదల చేశాడు. తన సినిమాకి `హను మేన్` అనే పేరు పెట్టాడు. సూపర్ హీరో నేపథ్యంలో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే అని గర్వంగా ప్రకటించుకున్నాడు. నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. త్వరలోనే ఆ విశేషాలూ బయటకు వస్తాయి.