బిగ్‌బాస్ సన్‌డే, ఫన్‌డేలో భాగంగా ఈ వారం అసలు సిసలు ఫన్ జనరేట్ అయ్యింది. హౌస్‌మేట్స్ వేసిన డాన్సులు, ఆటలు, పాటలతో సందడిగా సాగిపోయింది. వేరియేషన్ డాన్సులతో మాస్ స్టెప్పులిరగదీసి స్టేజ్ బద్దలుకొట్టేశారు హౌస్ మేట్స్. ఇక షో మధ్యలో హౌస్ మేట్స్‌కి సర్‌ప్రైజ్ ఇస్తూ, గద్దలకొండ గణేష్ వరుణ్ తేజ్‌ని గెస్ట్‌గా తీసుకొచ్చాడు హోస్ట్ నాగార్జున. గద్దలకొండ గణేష్ చేసిన హడావిడి ఇంక అంతా ఇంతా కాదు. స్టే ట్యూన్‌డ్ అనేలానే టీవీలకు అతుక్కుపోయారు ఆడియన్స్ ఈ వారం.
తెలంగాణా స్లాంగ్‌లో మాట్లాడుతూ గద్దలకొండ గణేష్ వీక్షకుల్ని, హౌస్‌మేట్స్‌ని మస్త్ ఎంటర్‌టైన్ చేశారు. హౌస్‌లో ఉన్న అమ్మాయిలు తమ తమ స్టైల్‌లో వరుణ్ తేజ్‌కి లవ్ ప్రపోజ్ చేయమనే టాస్క్ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. భీమవరం అమ్మాయి వితిక గోదావరి యాసలో ప్రపోజ్ చేసింది. శివజ్యోతి తెలంగాణా యాసలో చిలిపిగా ప్రపోజ్ చేసి వరుణ్ తేజ్ దగ్గర మార్కులు కొట్టేసింది.
అందరూ చూస్తున్నారు కొంచెం ఆచి తూచి ప్రపోజ్ చేయమని శ్రీముఖికి సూచించాడు వరుణ్ తేజ్. ఇక పునర్నవి ప్రపోజ్ చేసేటప్పుడు చేతులు వణుకుతున్నాయి వరుణ్ తేజ్.. అంటే, హో.! ఆమె నాకు ఎందుకు ప్రపోజ్ చేయలేకపోతుందంటే, ఆల్రెడీ ఎవరికో ప్రపోజ్ చేసేసింది.. అని స్పాంటీనియస్‌గా కౌంటర్ వేసి, వరుణ్ తేజ్ అందరిలోనూ నవ్వులు పూయించాడు. నిజంగానే పునర్నవి ప్రపోజ్ చేయలేకపోయింది. చివరిగా ఒక నమస్కారం పెట్టి తప్పుకుంది. ఇలా ఈ వారం బిగ్‌బాస్ సన్‌డే ఫన్‌డే ఫుల్ ఫన్‌తో నిండిపోయింది.