గం గం గ‌ణేశా మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: గం గం గణేశా 
దర్శకత్వం: ఉదయ్‌ శెట్టి
నటీనటులు: ఆనంద్ దేవర కొండ, ప్రగతి శ్రీవాత్సవ, వెన్నెల కిశోర్, నయన్ సారిక.


రచన - కథ : ఉదయ్‌ శెట్టి
నిర్మాతలు: కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
ఆర్ట్ డైరెక్టర్ : కిరణ్ మామిడి
సంగీతం: చైతన్ భరద్వాజ్
ఛాయాగ్రహణం: ఆదిత్య జవ్వాడి
కూర్పు : కార్తీక శ్రీనివాస్.ఆర్


బ్యానర్స్: హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ: 31 మే 2024


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5


విజయ్ దేవరకొండ తమ్ముడు అనే గుర్తింపు నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాడు ఆనంద్ దేవర కొండ. అన్న రెండో సినిమాకే స్టార్ హీరో అయిపోయాడు. కానీ తమ్ముడు బేబీ సినిమా వరకు హిట్ అందుకోలేకపోయాడు. ఆనంద్ సినీ కెరియర్లో 'బేబీ' బిగ్గెస్ట్ హిట్. కానీ ఆ క్రెడిట్ మొత్తం హీరోయిన్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. బేబీ తరవాత కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. తనకు సరిపడా కథలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం 'గం గం గణేశా ' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఆనంద్ దేవర కొండ హిట్ అందుకున్నాడా లేదో చూద్దాం. 


కథ: గణేష్ (ఆనంద్ దేవరకొండ), శంకర్ ('జబర్దస్త్' ఇమ్మాన్యుయేల్) వీరిద్దరూ అనాథలు. చిన్న దొంగతనాలు చేస్తూ రోజులు గడుపుతుంటారు. సూపర్ మార్కెట్‌లో ఉద్యోగం చేసే శృతి (నయన్ సారిక)ను గణేష్ ప్రేమిస్తాడు. తన బాస్ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గణేశ్ కి శృతి    హ్యాండ్ ఇస్తుంది. బాస్ తో పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఈ విషయం తెలిసిన గణేష్ బాధ పడతాడు. కేవలం డబ్బు లేకపోవటం వలన తనని వదిలేసిందని, ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అన్న కసితో లక్షలు సంపాదిస్తానని శపథం చేస్తాడు.  ఈ క్రమంలో అరుణ్ సుతారియా(బిగ్‌బాస్ ప్రిన్స్ యావర్) దగ్గర ఓ డైమండ్ దొంగతనం చేసేందుకు భారీ డీల్ కుదుర్చుకుంటాడు గణేష్. ఇంకో వైపు నంద్యాలలో కిశోర్ రెడ్డి (రాజ్ అర్జున్) ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రెడీ అవుతాడు. కిశోర్ రెడ్డి ని ఎలాగైనా ఓడించాలని అధికారంలో ఉన్న ప్రభుత్వం అతనికి చెందిన 80 కోట్లను సీజ్ చేయిస్తుంది. అతడికి డబ్బులు రాకుండా అన్ని దారులు మూసేస్తారు. ఎలాగైనా గెలవాలని కిషోర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ,ఆ టైంలో ముంబై నుంచి వంద కోట్లు వినాయకుడి విగ్రహంతో తీసుకొచ్చే పని రుద్ర (కృష్ణచైతన్య)కి అప్పగిస్తాడు. డీల్ ప్రకారం గణేశ్ డైమెండ్ ని దొంగిలించాక దాన్ని తామే అమ్ముకుని కోటీశ్వరులు అయిపోదామనుకుంటాడు. ఈ క్రమంలో గణేశ్ కి, అతని ఫ్రెండ్ కి  ఎదురైన సమస్యలు, రుద్ర ఆ డబ్బులు ఉన్న వినాయక విగ్రహం తీసుకొచ్చాడా? గణేష్ కి, వినాయక విగ్రహానికి సంబంధం ఏంటి? కిషోర్ రెడ్డి గెలిచాడా? గణేష్ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అన్నది సినిమాలో చూడాల్సిందే. 


విశ్లేషణ: కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కిన క్రైమ్ స్టోరీ 'గం గం గణేశా'.  ఈ సినిమా చూసినప్పుడు నిఖిల్ నటించిన 'స్వామిరారా ' సినిమా గుర్తుకు వస్తుంది. హీరో, అతని ఫ్రెండ్స్ చేసే క్రైమ్ కామెడీగా ఉంటుంది. చివరికి ఒక పెద్ద ప్రాబ్లెమ్ లో చిక్కుకుంటారు. ఈ సినిమాలో కూడా గణేశ్, అతని ఫ్రెండ్ ఎదో సదా సీదా దొంగతనాలు చేసుకుంటూ, అత్యాశకి పోయి ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారో కామెడీగా తెరకెక్కించాడు దర్శకుడు.  గణేశ్ విగ్రహం చుట్టూ కథ తిరుగుతుంది. అందరూ ఒకే వస్తువు కోసం గ్రూపులు గ్రూపులుగా రావటం, ఒక విగ్రహం కోసం ఆ గ్రూపులు ఎందుకు వచ్చాయి అని క్లైమాక్స్ లో రివీల్ చేసి ట్విస్టులు మామూలుగానే ఉంటాయి.  ఈ వారం రిలీజ్ అయిన మూడు సినిమాల్లో కొంచెం నవ్వుకునే సినిమా  ఇదే అని చెప్పొచ్చు.  ఫస్ట్ హాఫ్ లో ఒక క్యారెక్టర్ తర్వాత మరొక క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఆనంద్ దేవరకొండ - నయన్ సారిక ల లవ్ స్టోరీ,  ప్రిన్స్ యావర్ ఇంటర్ డక్షన్, ఇలా కొంత స్లో గా ఉంటుంది.  ఓ కథతో మరొక కథ కనెక్ట్ కావడనికి టైం పట్టింది. వన్స్ కథలోకి వెళ్లిన తర్వాత కామెడీతో కనెక్ట్ అయ్యి కథలో ఇన్వాల్వ్ అయిపోతాము.  కామెడీ బానే వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ లో కూడా వచ్చే ట్విస్ట్ లు, కామెడీ బాగుంది.   క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో  మరొకసారి మెప్పించాడు. ఇవన్నీ పక్కన పెడితే  వంద కోట్ల విలువైన విగ్రహం తెచ్చేటపుడు ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఎంత ప్లానింగ్ ఉంటుంది. ఇప్పటికే అధికార పార్టీ కిషోర్ రెడ్డి డబ్బులను సీజ్ చేసినప్పుడు ఇంకా జాగ్రత్తగా డీల్ చేస్తారు కదా. కానీ ఈ కథలో అదేం కనిపించదు,. కేవలం కామెడీ కోసం అన్నట్లు కొన్ని సీన్లు రాసుకున్నారు అనిపిస్తుంది. అంత విలువైన విగ్రహాన్ని చాలా సింపుల్ గా ముంబయి నుంచి తీసుకొచ్చేయడం. చాలా ఈజీగా విగ్రహాన్ని మార్చేయడం, ఇవన్నీ సిల్లీగా అనిపిస్తాయి. ఆ విగ్ర హం  కోసం చేసే ఫీట్లు కూడా  సిల్లీగా ఉంటాయి. మొత్తానికి ఒక క్రైం జానర్ ని కంప్లీట్ కామెడీ సినిమాగా తీశారు. 


నటీ నటులు: ముందు సినిమాలకంటే ఆనంద్ దేవరకొండ నటన బాగుంది. లుక్ కూడా బాగుంది. డాన్స్ కూడా పరవాలేదనిపించాడు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారన్న పేరే కానీ వారికి పెద్దగా ప్రాధాన్యత లేదు.  'పెదకాపు' ఫేమ్ ప్రగతి శ్రీవాస్తవ పల్లెటూరి అమ్మాయిగా బానే ఉంది. ఈ సినిమాతో ఆమెకి ఇలాంటి పాత్రలు మరికొన్ని రావొచ్చు. నయన్ సారిక పాత్ర గురించి చెప్పుకోవడానికేమీ లేదు ఇలా కనిపించి అలా మాయం అయినట్టు ఉంటుంది. రాజ్ అర్జున్ విలన్ పాత్రలో యావరేజ్ గా నిలిచారు. ఇమ్మాన్యుయెల్ కి కొంచెం ఫుల్ లెంగ్త్ రోల్ దొరికింది. తన కామెడీ టైమింగ్ పరవాలేదు. వెన్నెల కిషోర్ ది చెప్పుకోదగిన పాత్ర కాకపోయినా కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు.  


టెక్నికల్: టెక్నికల్  'గం గం గణేశా' పర్వాలేదానిపిస్తుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం ఒకే అనిపిస్తుంది. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. పాటలు ఆకట్టుకునేట్టు లేవు. ఆదిత్య జవ్వాడి ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువల్లో కొన్ని లోపాలున్నాయి. కొన్ని ట్విస్టులు, కామెడీ సీన్ల వరకు పర్వాలేదు, దర్శకుడిగా ప్రేక్షకుల్ని మెప్పించటంలో విఫలమయ్యాడు ఉదయ్ శెట్టి.   


ప్లస్ పాయింట్స్
కామెడీ 
వెన్నెల కిషోర్ 


మైనస్ పాయింట్స్
రొటీన్ క‌థ‌
పెద్ద‌గా పండ‌ని ట్విస్టులు     


ఫైనల్ వర్దిక్ట్ : కామెడీగా మారిన  క్రైమ్‌..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS