నటీనటులు: నాని, కార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్, లక్ష్మి తదితరులు
దర్శకత్వం: విక్రమ్ కే కుమార్
నిర్మాణం: మైత్రి మూవీ మేకర్స్
సంగీతం: అనిరుద్
సినిమాటోగ్రఫర్: కూబా
విడుదల తేదీ: సెప్టెంబర్ 13, 2019
రేటింగ్: 2.75/5
కొంతమంది దర్శకుల సినిమా వస్తోందంటే ఎప్పుడూ ఓ అటెన్షన్ మొదలైపోతుంటుంది.
వాళ్లు గతంలో ఫ్లాపులు తీసినా పెద్దగా పట్టించుకోం. వాళ్ల సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చు. దర్శకులుగా వాళ్లు మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వరు. అలాంటి వాళ్లలో విక్రమ్ కె.కుమార్ ఒకడు. `13 బి`, `ఇష్క్`, `మనం`, `24`.... ఇలా ఏ కథ చెప్పుకున్నా అందులో ఏదో ఓ మ్యాజిక్ ఉంటుంది. చాలా క్లిష్టమైన కథల్ని ఎంచుకుని, ఎంతో ఇష్టంగా మలిచి, ప్రేక్షకుల్ని చివరి వరకూ సీటు అంచున కూర్చోబెట్టగలిగే సినిమాల్ని అందివ్వగలరు. అలాంటి దర్శకుడికి నాని లాంటి నేచురల్ స్టార్ తోడైతే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? అందుకే `గ్యాంగ్ లీడర్`పై అంచనాలు పెరిగాయి. మరి వాటిని వీరిద్దరూ ఏమేరకు అందుకున్నారు? ఈ గ్యాంగ్ చేసిన సందడేంటి?
* కథ
పెన్సిల్ పార్థసారధి (నాని) ఓ రివైంజ్ రైటర్. హాలీవుడ్ హిట్ సినిమాల్ని చూసి మక్కీకి మక్కీ కాపీ కొట్టి వాటినే నవలలుగా రాసి ఫేమస్ అయిపోదామని చూస్తుంటాడు. అలాంటి పెన్సిల్‌ని వెదుక్కుంటూ అయిదుగురు ఆడవాళ్లు వస్తారు. తామంతా ఒకరిపై పగ తీర్చుకోవాలని, అందుకు సహాయం చేయమని పెన్సిల్‌ని అర్థిస్తారు.
ఈ ప్రయాణం మొత్తాన్ని నవలగా రాసి, పేరు కొట్టేద్దామని పెన్సిల్ కూడా ఒప్పుకుంటాడు. మరి వీళ్లంతా ఎవరిపై పగ తీర్చుకోవాలనుకుంటున్నారు? ఒకొక్కరి వెనుక ఉన్న కథేమిటి? ఈ అయిదుగురికీ రూ.300 కోట్ల బ్యాంకు రాబరీకి ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెరపై చూడాలి.
* నటీనటులు
నాని ఎప్పటిలా సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకునే ప్రయత్నం చేశాడు. తన టైమింగ్ తో పెన్సిల్ పార్ధసారధి పాత్రని నడిపించేశాడు. తొలి సన్నివేశాల్లో నాని నటన మరింత మెప్పిస్తుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ ఎపిసోడ్ లో. ప్రియాంకకి ఇదే తొలి తెలుగు సినిమా. అందంగా కనిపించింది. నటన కూడా ఓకే.
లక్ష్మి, శరణ్య.. వీళ్లు అనుభవజ్ఞులు. వాళ్ల అమాయకమైన నటన నచ్చుతుంది. ఇక... కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించాడు. ఓ యువ హీరోని విలన్‌గా ఎంచుకోవడం వరకూ బాగుంది. దానికి ఒప్పుకుని ధైర్యం చేశాడు కార్తికేయ. అయితే... ఆ పాత్రని మలిచిన విధానం మాత్రం మెప్పించదు.
* సాంకేతిక వర్గం
అనిరుధ్ పాటలు కథతో పాటు ప్రయాణం చేశాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రోలింగ్ టైటిల్స్‌లో వచ్చే పాట కూడా నచ్చుతుంది. కెమెరా వర్క్ బాగుంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో విక్రమ్ తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. ద్వితీయార్థంలో చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది.
* విశ్లేషణ
నాని - ఓ అయిదుగురు ఆడవాళ్లు - ఓ విలన్.. దాని చుట్టూ 300 కోట్ల రాబరీ. ఇదీ స్థూలంగా కథ. ఈ కథేమిటన్నది 20 నిమిషాల్లోనే అర్థమైపోతుంది. విలన్ అనేవాడు ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? అనేదే పట్టుకోవాలి. ఎలా ఉంటాడన్నది ప్రేక్షకులకు ముందే తెలుసు. ఇక తెలియాల్సింది ఎక్కడ ఉంటాడన్నదే. అదంతా ఇన్వెస్టిగేషన్‌లో తేలాల్సిన విషయం. అది ఎంత బాగా రాసుకుంటే ఈ సినిమా అంత బాగుంటుంది. ఓ బ్యాంకు దొంగతనంతో కథ మొదలవుతుంది. అక్కడి నుంచే దర్శకుడు కథ చెప్పడం మొదలెట్టేశాడు.
తొలి 20 నిమిషాల వరకూ నాని కనిపించడు. అయినా కథ ఓ సీరియస్ మూడ్‌లో నడుస్తుంటుంది. ఎప్పుడైతే నాని ఎంట్రీ ఇస్తాడో అక్కడి నుంచి కథకి కామెడీ టచ్ వచ్చింది. నాని తన టైమింగ్‌తో చాలా సన్నివేశాల్ని పండించాడు. నాని జరిగే ఇన్వెస్టిగేషన్ ఏమంత గొప్పగా ఉండదు. కాకపోతే నాని వల్లే కొన్ని సీన్లు పాస్ అయిపోయాయి. ముఖ్యంగా... వెన్నెల కిషోర్ `గే` కామెడీ. ఇంట్రవెల్ వరకూ ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. ఇక ఈ సినిమాని నిలబెట్టాల్సింది, నడిపించాల్సింది.. ద్వితీయార్థమే. అక్కడే.. విక్రమ్ చాలా తప్పులు చేశాడు.
ఆ ఆరోవాడు దేవ్ అన్న సంగతి.. పెన్సిల్ చేసిన ఇన్వెస్టిగేషన్ వల్ల తేలిన వ్యవహారం కాదు. దేవ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పే ఫ్లాష్ బ్యాక్‌లో క్రైమ్ మొత్తం తెలిసిపోతుంది.
ఈ మాత్రం దానికి ఇన్వెస్టిగేషన్ చేసిన ఫలితం ఏముంది? ద్వితీయార్థంలో పెన్సిల్ - దేవ్‌కి మధ్య ఎత్తులు, పై ఎత్తులతో సినిమా వేగంగా పరిగెట్టాల్సింది. అక్కడ ఎమోషన్ సీన్స్ పై ఆధారపడి తప్పు చేశాడు విక్రమ్. లక్ష్మీ ఎపిసోడ్ బాగున్నా - సుదీర్థంగా సాగడంతో కథకి బ్రేక్ పడిపోయింది. తొలిసగంలో ఉన్న కామెడీ కూడా ద్వితీయార్థంలో కనిపించదు. దాంతో రిలీఫ్ లేకుండా పోయింది. ఓ రొటీన్ క్లైమాక్స్‌తో సినిమాని ముగించాడు. నిజానికి అక్కడ ఇంకేదో భయంకరమైన ట్విస్టు వస్తుందనుకుని ప్రేక్షకులు ఆశిస్తారు. అది వాళ్ల తప్పు కాదు. ఎందుకంటే ఇది విక్రమ్ సినిమా. తన సినిమాల్లో ట్విస్టులతో పరుగులు పెట్టింది, స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తుంటాడు. అయితే ఆ మ్యాజిక్, ట్విస్టులు ఇందులో కనిపించలేదు.
* ప్లస్ పాయింట్స్
నాని
టెక్నికల్ టీమ్
తొలి సగం
* మైనస్ పాయింట్స్
ద్వితీయార్థం
క్లైమాక్స్
* ఫైనల్ వర్డిక్ట్: ఓన్లీ ఫర్ నాని
- రివ్యూ రాసింది శ్రీ