అలనాటి అద్భుత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. కరోనా తగ్గి నెగిటీవ్ వచ్చింది కూడా. అయితే ఇంతలోనే... మృత్యువు కబళించింది. రత్నకుమార్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయన కరోనా బారిన పడి చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఘంటసాల వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రత్నకుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు వెయ్యికిపైగా చిత్రాలకు ఆయన తన వాయిస్ అందించి ఆకట్టుకున్నారు. విరామమే లేకుండా.. ఎనిమిది గంటలపాటు డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ ఆయన స్థానం సంపాదించుకున్నారు. మాటల రచయితగానూ పని చేశారు. రత్నకుమార్ మరణానికి టాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది.