ప్రముఖ సినీ గీత రచయిత కందికొండ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గతకొన్నేళ్లుగా ఆయన కాన్సర్ తో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కందికొండ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆయనకు ఖరీదైన వైద్యం చేయించే స్థితిలో కుటుంబ సభ్యులు లేరు. ఈ సందర్భంగా కందికొండని ఆదుకోవాలన్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. కందికొండకు తక్షణం రూ.2.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కందికొండ లాంటి మంచి గీత రచయిత, తన సాహితీ ప్రస్థానాన్ని మళ్లీ కొనసాగించాలని, ఆయన అనారోగ్యం నుంచి కోలుకోవాలని కేటీఆర్ అభిలషించారు.
మళ్లికూయవే గువ్వా (ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం), చెన్నై చంద్రమా (అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి) లాంటి పాటలతో అలరించారు కందికొండ. తెలంగాణ జీవనాన్ని ప్రతిబింబించేలా పాటలు రాయడంలో ఆయన నేర్పరి. ఎక్కువగా పూరి చిత్రాలకు పాటలు రాశారు.