నటీనటులు : భార్గవ పోలుదాసు, రాకేశ్ గలేభే, పూజిత కురపర్తి తదితరులు
దర్శకత్వం : కిరణ్ కొండమడుగుల
నిర్మాతలు : ఎస్ ఒరిజినల్స్, ఆఫ్ బీట్ ఫిల్మ్స్
సంగీతం : శ్రీచరన్ పాకల
సినిమాటోగ్రఫర్ : మనోజ్ రెడ్డి
ఎడిటర్: జి.ఎస్
రేటింగ్: 2.75
పెద్ద సినిమాల మాట అటుంచితే, చిన్న చిత్రాలకు ఓటీటీ వరంగా మారింది. కాస్త పట్టున్న కథ ఉంటే చాలు.. ఓటీటీలో ప్రదర్శించుకోవడానికి ఓ వేదిక దొరికేస్తోంది. ఇప్పుడంటే థియేటర్లు తెరచి లేవు గానీ, చిన్న సినిమాలకు ఎప్పుడూ థియేటర్ల సమస్యే. ఒకవేళ రేపు థియేటర్లు తెరచినా.. చిన్న సినిమాలకు ఎలాగూ చోటు దొరకదు. కాబట్టి... నేడూ - రేపూ ఎప్పుడైనా సరే, ఓటీటీ మంచిమార్గంకానుంది.ఈమధ్య ఓటీటీలలో చిన్నసినిమాలు విరివిగా వస్తున్నాయి. అందులో `గతం` ఒకటి. ఇందులో స్టార్లెవరూ లేరు. కనీసం తెలిసిన మొహం ఒక్కటీ కనిపించదు. మరి.. `గతం` ఎలా ఉంది? అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ సినిమాలో ఓ లుక్కు వేయొచ్చా? లేదా?
* కథ
రిషి (రాకేష్) ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడతాడు. దాంతో తనకు గతం గుర్తుండదు. ఆఖరికి తన ప్రేయసి అతిథి (పూజిత)ని కూడా మర్చిపోతాడు. రిషికి తల్లి లేదు. తండ్రి ఒక్కడే ఎక్కడో దూరంగా బతుకుతున్నాడు. ఆ తండ్రిని చూసే ఉద్దేశంతో.. ఆ చోటుకి బయల్దేరతాడు. కానీ మధ్యలో కారు ఆగిపోతుంది. అర్జున్ (భార్గవ) వీద్దరికీ సహాయం చేయాలన్న ఉద్దేశంతో తన కాటేజ్‌కి తీసుకెళ్తాడు. అయితే అక్కడ విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. అర్జున్ కొడుకు ఓ సైకోలా ప్రవర్తిస్తాడు. అతిథిని శారీరకంగా లోబరచుకోవాలని చూస్తాడు. ఆఖరికి అర్జున్ కూడా తన కొడుకు వైపే ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఆ జంట ఎలా తప్పించుకుంది. రిషి గతం ఏమిటి? అదెలా గుర్తొచ్చింది? అన్నది మిగిలిన కథ.
* విశ్లేషణ
కథ చదువుతున్నప్పుడు సింపుల్ గానే వుంది అనిపిస్తుంది. కానీ.. ఇందులో చాలా కాంప్లికేటెడ్ విషయాలు ఉన్నాయి. కథలో మలుపులు తప్పకుండా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇంట్రవెల్ ట్విస్ట్. దాన్ని కొంత మంది థ్రిల్లర్ ప్రియులు ఊహించొచ్చేమో గానీ, ఆ తరవాత.. ద్వితీయార్థంలో వచ్చే మలుపుని మాత్రం పట్టుకోలేరు. దర్శకుడు కేవలం తాను చెప్పాలనుకున్న పాయింట్ పై మాత్రమే ఫోకస్ చేశాడు. దాంతో అనవసరమైన పాత్రలు, సన్నివేశాలు ఏమాత్రం కనిపించవు. విదేశంలో జరిగిన కథ ఇది కాబట్టి.. లొకేషన్ల పరంగా కొత్త ఫీల్ కలుగుతుంది.
ద్వితీయార్థంలో కథ మరో మలుపు తిరుగుతుంది. ఆ మలుపు వరకూ.. సినిమాని సాగదీసినట్టు అనిపిస్తుంది. రిషి కోసం చేసిన ఛేజ్ ని తగ్గించుకుంటే బాగుండేది. కాకపోతే... ఇప్పటికే ఇది చాలా చిన్న సినిమా. 90 నిమిషాల నిడివి ఉంది అంతే. ఆ ఛేజింగులూ తగ్గించుకుంటూ పోతే.. మరింత చిన్న సినిమాలా మారేది. సినిమా ప్రారంభం అయినప్పుడు ఇదో సైకో సినిమా అనిపిస్తుంది. క్రమంగా అసలు విషయం అర్థం అవుతుంది. ఎవరు సైకోనో, ఎందుకు ఇలా ప్రవర్తించాల్సివచ్చిందో తెలుసుకున్నప్పుడు షాక్ కి గురవుతారు. ఓ తండ్రి తన కూతురు కోసం చేసిన అన్వేషణ లాంటి కథ ఇది. అయితే దానికి థ్రిల్లర్ నేపథ్యం జోడించడంతో కొత్త పంథాలో సాగినట్టు కనిపిస్తుంది.
* నటీనటులు
తెరపై స్టార్లెవరూ లేరు. కనీసం చూసిన మొహాలే కనిపించవు. అయితే.. ప్రతీ ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేశారు. కొత్తవాళ్లే కాబట్టి.. ఓ ఫ్రెష్ ఫీల్ వచ్చేది. ఏ పాత్ర ఎలాంటిదో.. ఊహించే ఛాన్స్ దక్కకుండా ప్లస్ అయ్యింది. రిషి కాస్త విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్‌ని ఫాలో అవ్వడానికి ట్రై చేశాడనిపిస్తుంది. భార్గవ నటన... కూడా ఆకట్టుకుంటుంది.
* సాంకేతిక వర్గం
టెక్నికల్ గా ఈ సినిమా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా స్క్రిప్ట్ దశలోనే బాగా వర్క్ చేశారు. ఏది అవసరమో, ఏది కాదో... ముందే అవగాహనకు వచ్చి స్క్రిప్టుని వీలైనంత వరకూ ట్రిమ్ చేసుకున్నారు. పాటల వైపు దృష్టి సారించకపోవడం మంచిదైంది. లేదంటే కథ ఫ్లో దెబ్బతినేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి మంచి మార్కులు పడతాయి.
ప్లస్ పాయింట్స్
తక్కువ నిడివి
ట్విస్టులు
సహజమైన నటన
మైనస్ పాయింట్స్
ఓవర్గానికి మాత్రమే పరిమితం
* ఫైనల్ వర్డిక్ట్: ఓసారి చూడొచ్చు