ఇటీవల రీమేక్ సినిమాలపై దృష్టి పెట్టింది గీతా ఆర్ట్స్. `నాయట్టు` అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తోంది గీతా ఆర్ట్స్. ఇప్పుడు మరో పర భాషా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.
ఇటీవల తమిళంలో విడుదలైన చిత్రం `మానాడు`. శింబు కథానాయకుడిగా నటించాడు. వెంకట్ ప్రభు దర్శకుడు. ఎస్.జె సూర్య ఇందులో ప్రతినాయకుడు. టైమ్ లూప్ కాన్సెప్టుతో సాగే సినిమా ఇది. తెలుగులో `లూప్` పేరుతో డబ్బింగ్ కూడా చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. తమిళంలో అయితే పెద్ద హిట్. అందుకే ఈ సినిమాని తెలుగులో.. రీమేక్ చేయాలని అనుకుంటున్నార్ట. గీతా ఆర్ట్స్ ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం గట్టిగా ప్రయత్నిస్తోందని టాక్. ఈ సినిమాని సాయిధరమ్ తేజ్ లేదా వైష్ణవ్ తేజ్ లతో రీమేక్ చేయాలని, యంగ్ హీరో ఎవరైనా సరే, ఈ కథకు సరిపోతారని భావిస్తున్నార్ట. అయితే వెంకట్ ప్రభునే తెలుగులో ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారా? లేదంటే మరో దర్శకుడ్ని ఎంచుకుంటారా? అనేది తెలాయల్సివుంది.