`ఆహా`లోనే కాదు... తెలుగు ఓటీటీలోనే అత్యంత భారీ విజయాన్ని అందుకుంది `అన్ స్టాపబుల్`. ఈ షో.. ఆహాకు మంచి ఆదరణ తీసుకొచ్చింది. ఈ షో తో ఆహాని సబ్ స్కైబ్ చేసుకునేవాళ్ల సంఖ్య బాగా పెరిగింది. మహేష్ బాబుతో చేసిన చిట్ చాట్ తో.. తొలి సెషన్ దిగ్విజయంగా ముగిసింది. ఇప్పుడు సెకండ్ సీజన్ కోసం జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే... అల్లు అరవింద్ బాలయ్యని అంత తేలిగ్గా వదిలేట్టు కనిపించడం లేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బాలయ్యతో ఓ సినిమా చేయడానికి అరవింద్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు టాక్.
అన్ స్టాపబుల్ కోసం బాలయ్యకు భారీ పారితోషికం ఇచ్చారు అరవింద్. గీతా ఆర్ట్స్ లో బాలయ్యకు అపూర్వమైన ట్రీట్ మెంట్ దక్కింది. అందుకే బాలయ్య కూడా గీతా ఆర్ట్స్ లో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకూ కథ, దర్శకుడు అనేవేం ఖరారు కాలేదు. కాకపోతే... బాలయ్య ఈ సినిమా చేస్తానని ఎగ్రిమెంట్ చేశార్ట. బాలయ్య ఓకే అన్నారు కాబట్టి... ఇక కథ కోసం అన్వేషించడం మొదలెట్టాలి. గీతా ఆర్ట్స్‌లో ఇప్పటికే చాలామంది దర్శకులు కథలు చెప్పారు. వాటిలో బాలయ్యకు సరిపడ ఓ కథని ఫైనల్ చేసుకుంటే... ఈ సినిమా పట్టాలెక్కేసినట్టే.