వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం గని. ఏప్రిల్ 8న విడుదల అవుతోంది. ఈ సినిమా ఎప్పుడో పూర్తయిపోయి, ఫస్ట్ కాపీ చేతిలో ఉంది. అయితే సరైన రిలీజ్ డేట్ కోసం చిత్రబృందం ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఏప్రిల్ 8న ఈ సినిమాని తీసుకొస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమిది. దాదాపుగా రూ.50 కోట్లు ఖర్చు పెట్టారు. అదంతా రాబట్టుకోవాలంటే సూపర్ హిట్ కొట్టాల్సిందే. అయితే నాన్ థియేటరికల్ రైట్స్ రూపంలో ఇప్పటికే ఈ సినిమాకి రూ.25 కోట్లు వచ్చేశాయి.
శాటిలైట్, ఓటీటీ, హిందీ డబ్బింగ్ అన్నీ కలిపి ఈ సినిమా పాతిక కోట్లు పలికినట్టు టాక్. థియేటర్ నుంచి పాతిక కోట్లు వస్తే చాలు ఈ సినిమా గట్టెక్కేస్తుంది. అయితే అదంత సులభమైన విషయం కాదు. ఆర్.ఆర్.ఆర్ మానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో రెండు వారాలు ఆ సినిమా ప్రభావం చూపిస్తుంది. దాన్ని తట్టుకొని నిలబడడం మామూలు విషయం కాదు. కాకపోతే.. ఏప్రిల్ 8 నాటికి ఆర్.ఆర్.ఆర్.. కాస్త స్లో అవుతుందన్నది గని నిర్మాతల ఆశ. చూద్దాం.. ఏమవుతుందో?