సౌత్ లో స్టార్ డమ్ సంపాయించుకున్న హీరోయిన్లు అంటే బాలీవుడ్ కి చిన్నచూపే. పైగా అక్కడ ప్రాంతీయ అభిమానం కూడా కాస్త ఎక్కువే. కాజల్, తమన్నా, తాప్సీ నుంచి పూజాహెగ్డే వరకూ.. అక్కడ అవకాశాలు దక్కాయంటే స్థానిక కోటా మేటర్ చేసిందనేది ఓపెన్ సీక్రెట్. అయితే ఈ ట్రెండ్ ని రష్మిక మందన బ్రేక్ చేసింది. కన్నడ పరిశ్రమ నుంచి రష్మిక 'గీత గోవిందం' తర్వాత టాలీవుడ్ టాప్ లీగ్ లో చేరింది. పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత బాలీవుడ్ జనాలని కూడా ఆకర్షించింది. నిజానికి పుష్పకి ముందే గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలని బాలీవుడ్ లో సైన్ చేసింది రష్మిక. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఇంకా విడుదల కాకుండానే మరో భారీ ఆఫర్ రష్మిక కి దక్కింది.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఎనిమల్’లో రష్మికనే కథానాయికగా ఖరారు చేశారు. ముందు ఈ చిత్రానికి హీరోయిన్ గా పరిణీతి చోప్రాని ఎంపిక చేశారు. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. ఐతే ఆమె ఈ పాత్రకు సరిపోవడం లేదనే భావన దర్శక నిర్మాతలకు కలిగింది. దీంతో ఆమె స్థానంలోకి రష్మికను తీసుకున్నారు. బేసిగ్గా ఒక బాలీవుడ్ హీరోయిన్ ని తొలగించి ఆమె స్థానంలో మరో హీరోయిన్ భర్తీ చేయడం పెద్ద టాక్ అఫ్ ది టౌన్. పైగా 'చోప్రా' లాంటి కుటుంబం నేపధ్యం వున్నవారి జోలికి అంత తేలిగ్గా వెళ్ళరు. కానీ ఇప్పుడు ఆమె స్థానంలో సౌత్ నుంచి వచ్చిన రష్మిక మందనని భర్తీ చేయడం విశేషమనే అనుకోవాలి. పైగా రష్మిక చేస్తున్న బాలీవుడ్ సినిమా ఇకా ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఇలాంటి దశలో రణబీర్ కపూర్ సినిమా రష్మిక ఖాతాలో చేరడం ఇంకా పెద్ద విశేషమనే చెప్పాలి.