టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో, ప్రేక్షకుల అవగాహన కూడా అంతకంటే ఎక్కువ పెరిగిపోయింది. ఫైట్స్ చూస్తే ఎన్ని రోపులు వాడారో లెక్క గట్టేస్తున్నారు. ఏదీ సీజీనో, ఏది సెట్లో, ఏది రియల్ లొకేషనో పసిగట్టేస్తున్నారు. ఏది వర్జినల్ షాటో.. గ్రాఫిక్సో.. వాళ్లకు బాగా అర్థమైపోతోంది. ఇంత తెలివైన ప్రేక్షకుల్ని ఏమార్చాలంటే మాటలు కాదు. సినిమా వాళ్లు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా స్పెషల్ ఎఫెక్ట్స్ విషయంలో. అవెంత సహజంగా ఉంటే.. అంత మంచిది. ఏమాత్రం సీజీలా కనిపించినా మోసేస్తుంటారు.
గాడ్ ఫాదర్ టీజర్... ఆదివారం విడుదలైంది. టీజర్ అంతా బాగానే ఉంది. అయితే చివర్లో సల్మాన్, చిరు ఒకే జీపులో గోడని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన షాట్ మాత్రం ఫ్యాన్స్‌ని సైతం మింగుడు పడడం లేదు. సినిమా స్థాయేంటి? ఆ సీజీలేంటి? అంటూ బాహాటంగానే అనేస్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా తయారైపోయాయి. సీజీలు బ్రహ్మాండంగా రావాలంటే బడ్జెట్ అవసరం. చిరు సినిమాకి బడ్జెట్ లేదంటే అంతా నవ్వుతారు. సీజీ అంటే డబ్బులొక్కటే కాదు.. టేస్ట్, టైమ్... రెండూ ఉండాలి.
అప్పటికప్పుడు వండి వార్చేస్తే ఇలానే ఉంటుంది. అయినా టీజర్‌లోనే ఆ షాట్ పెట్టాలన్న తొందరెందుకు వచ్చిందో? కాస్త టైమ్ తీసుకొని.... దాన్ని ఇంకా బాగా డిజైన్ చేస్తే బాగుండేది. ఇలాంటి షాట్లు పంటి కింద రాళ్లలా తగులుతుంటాయి. సినిమా మూడ్ ని డిస్ట్రబ్ చేస్తాయి. `ఆచార్య`లో కూడా... ఫ్లాష్ బ్యాక్ లో బ్లాక్ అండ్ వైట్ నాటి చిరంజీవిని తీసుకొచ్చి.. నవ్వుల పాలయ్యారు. ఇప్పుడూ సీజీ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టకపోతే.. అదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది.