ఇటీవల కాలంలో వినోద వస్తువు అయిన సినిమాకు వివాదాల లంపాటకాలు ఎక్కువైపోయాయి. సినిమాని సినిమాగా చూడకుండా, ఎక్కడ ఏ పాయింట్‌లో తప్పు దొర్లుతుందా, దాని చుట్టూ వివాదం సృష్టించి పండగ చేసుకుందామా అని కొన్ని వర్గాలు చూస్తున్నాయి. అందులోనూ, 'మనోభావాలు' పేరిట సినిమాలకు చుట్టుకుంటున్న వివాదాలు ఒకింత సినీ పరిశ్రమని దెబ్బ తీస్తున్నాయనే చెప్పాలి.
మొన్నీమధ్య బాలీవుడ్ మూవీ 'పద్మావత్' విషయంలో జరిగిన రచ్చ గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఆ రచ్చ కారణంగా నిజానికి ఆ సినిమా చాలానే నష్టపోయింది. అందుకు భారీ మూల్యం చెల్లించాల్సిందెవరు? అదలా ఉంటే, చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఈ వివాదాలు సినిమా స్వేచ్ఛకు భంగపాటు కల్గిస్తున్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సినిమా 'రంగస్థలం' కూడా ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఆడియో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. పాటలు అయితే అభిమానుల్ని ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఇకపోతే గొడవెక్కడొచ్చిందంటారా? ఆ పాటల్లోనే. మొన్నీమధ్యనే విడుదలైన 'రంగమ్మా.. మంగమ్మా..' అనే సాంగ్‌లో దొర్లింది తప్పు. తప్పు అంటే తప్పని అనలేము కానీ, వివాదానికి కేంద్ర బిందవైంది మరి. ఈ పాట చరణంలో 'గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే..' అన్న లిరిక్ యాదవ మహిళల మనోభావాలు కించపరిచేలా ఉందట.
ఆ పాటలోని ఆ లిరిక్స్‌ని వెంటనే తొలగించాలని ఆల్ ఇండియా యాదవ హక్కుల సమితి అధ్యక్షుడు రాములు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే సినిమా విడుదలను అడ్డుకుంటామనే దాకా రేగింది ఈ వివాదం. అయితే ఈ వివాదం విషయంలో ఇంతవరకూ చిత్ర యూనిట్ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.